15 April, 2026 | 3:28 AM

అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి

15-04-2026 01:26 AM
  1. డీలిమిటేషన్‌పై జాతీయస్థాయిలో చర్చలు జరపాలి
  2. వికసిత్ భారత్‌కు అన్ని ప్రాంతాల సమాన ప్రాతినిథ్యం కీలకం
  3. సీట్ల పెంపుతో రాజకీయంగా అన్యాయం
  4. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ
  5. నేడు ‘ఇండియా’ కూటమి సమావేశం.. ఢిల్లీ వెళ్లనున్న సీఎం 

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) : నియోజకవర్గాల పెంపు విష యంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యా యం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశమైనందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళల రిజర్వేషన్, పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అం శాలను ఒకదానితో ఒకటి ముడి పెట్టి ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారని, అవి పూర్తిగా వేర్వేరు విషయాలని స్పష్టంచేశారు. మహిళల రిజర్వేషన్ బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలో నే 33 శాతం మహిళల రిజర్వేషన్‌ను యథాతథంగా వెంటనే అమలు చేయాలని, అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా అమలు చేయాలని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కేవ లం చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యానికి ఒక నైతి కత అవసరమని పేర్కొన్నారు. పునర్విభజనకు సంబంధించి గతంలో కూడా సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చుతూ డిలిమిటేషన్ నిర్వహించిన ట్లు గుర్తుచేశారు.

ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్ట వచ్చని తెలిపారు. లోక్‌సభ సీట్లను 850కు పెంచే ప్రతిపాదన వివాదాస్పద అంశమని పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి వాటిని ప్రో రేటా పద్ధతిలో కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషనుకు పూర్తి మద్దతు ఇవ్వటంతో పాటు, సీట్ల సంఖ్య పెంపు లేకుండా డిలిమిటేషనుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.

జనాభా లేదా ప్రో రేటా పద్ధతిలో లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణా ది రాష్ట్రాలు అంగీకరించబోవని తెలిపారు. ప్రో రేటా పద్ధతిలో అమలు చేస్తే దేశంలో తలెత్తబోయే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1970ల నుంచి దేశం జనాభా నియంత్రణ విధానంపై దృష్టి పెట్టినప్పటికీ, రాష్ట్రాల వారీగా జనాభా నియంత్రణ అమలు జరిగిన తీరు భిన్నంగా ఉందన్నారు.

జనాభాలో తేడాల వల్ల జాతీయ ఐక్యతపై ప్రభావం పడే ప్రమాదాన్ని గుర్తించి, ఇందిరా గాంధీ, అటల్ బీహారి వాజ్‌పేయి వంటి నాయకులు ఈ అంశాన్ని ఒక్కోసారి 25 సంవత్సరాల పాటు వాయిదా వేసినట్లు తెలిపారు. ఆర్థిక సహకా రం, సామాజిక, మానవ అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రో రేటా పద్ధతిలో సీట్ల పెంపు చేస్తే దేశ ఫెడరల్ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. వికసి త్ భారత్ లక్ష్య సాధనకు అన్ని ప్రాంతాల సమాన ప్రాతినిథ్యం దేశానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు.

సీట్ల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు దశాబ్దాలుగా జనాభా స్థిరీకరణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయని తెలిపారు. ఇవన్నీ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోతాయని, రాజకీయంగా బలహీనపడే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. 

నిధుల కేటాయింపులో వివక్ష..

ప్రో రేటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా, రాజకీయ అసమతుల్యతకు దారి తీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీలో ఇప్పటికే పక్షపాతం, వివక్ష ఉన్నట్లు తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందుతుంటే, తెలంగాణకు తక్కువ నిధులు వస్తున్నాయని ఉదాహరణగా చెప్పారు. ఇది దక్షిణాది- అసమానతకు సంకేతమని పేర్కొన్నారు. నిధుల వివక్షకు అదనంగా ఇప్పు డు సీట్ల పెంపు కారణంగా రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు.

దక్షిణా ది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించినప్పటికీ, పార్లమెంట్‌లో వారి ప్రాధాన్యం తగ్గిపోతుందని, జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది -మధ్య ప్రాంత రాష్ట్రాలు లాభపడతాయని తెలిపారు. అభివృద్ధిలో పాలుపంచుకున్న రాష్ట్రాలకు శిక్ష పడు తుందని, జనాభా పెరిగిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది అం కెల విషయంకాదని, దేశ సమగ్రత, సమాన త్వం, న్యాయానికి సంబంధించిన ప్రాథమిక అంశమని స్పష్టం చేశారు.

దక్షిణ రాష్ట్రాలు జాతీయ ఆదాయానికి నిరంతరం సహకరి స్తూ, సుపరిపాలన, అభివృద్ధి ప్రమాణాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ కృషిని పట్టించుకోకుండా దేశ ఐక్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రో రేటా మోడల్‌ను దక్షిణ రాష్ట్రాలు అంగీకరించవని, ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుందని, అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరమని సూచించారు. హైబ్రిడ్ మోడల్ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

అందరి ప్రాతినిధ్యంతో పాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతుల్యం చేస్తుందని వివరించారు. సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం 50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. హైబ్రిడ్ మోడ ల్ ప్రకారం, కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రోరాటా పద్ధతిలో, మిగతా సగాన్ని రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం, అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు.

స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా, మన ఆలోచనలకు తలుపులు తెరిచి కొత్త భావనలు స్వీకరిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రక్రియ అందరికీ న్యాయంగా, ఆమోదయోగ్యంగా ఉండే ఉత్తమ పరిష్కారాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. హైబ్రిడ్ మోడల్ ద్వారా అభివృద్ధి చెం దిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతో పా టు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయి లో చర్చలు జరిపి, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావాలని కోరారు.

భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని, ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఏకత్వాన్ని బలోపేతం చేసేలా ఉండాలని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కూడా సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వే రు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.

లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రో రేటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధా న్యం తగ్గిపోతుందని అప్రమత్తంచేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే  రాష్ట్రా లు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రా లు లాభపడే పరిస్థితి వస్తుందన్నారు. అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయం త్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ముఖ్యం గా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణా ది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు జరగబోయే నష్టంపై రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆం దోళన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ‘ఇండియా’ కూటమికి చెందిన కీలక నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమావేశాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పలువురు నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన కాకుండా, అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్‌పై ఉమ్మ డి పోరాటం చేసే అంశం, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.

జనాభాకు 50 వాతం, జీఎస్డీపీ 50 శాతం తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, ఇతర అభివృద్ధి పనులపై కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, జాతీయ స్థాయి లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ అధిష్టానంతో రేవంత్‌రెడ్డి చర్చించబోతున్న నేపథ్యంలో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది.