28 June, 2026 | 1:05 AM

యుద్ధం మళ్లీ మొదటికి!

28-06-2026 12:00 AM

కాల్పుల విరమణకు అంగీకరించారు.. సంప్రదింపులకు సమ్మితించారు.. హోర్ముజ్ జలసంధి నుంచి చమురు బ్యారెళ్లలో పదుల సంఖ్యలో నౌకలు కదిలాయి. గత ఫిబ్రవరిలో ఖమేనీని హత్య చేయడంతో మొదలైన అమెరికా, ఇరాన్ యుద్ధం ముగిసిందని ప్రపంచం ఊపరిపీల్చుకున్నది. అయితే.. పశ్చిమాసియాలో ఈ ప్రశాంత పరిస్థితి ఎంతోకాలం నిలువలేదు. వారం తిరక్కుండానే పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది.

హోర్ముజ్‌లో సరైన మార్గంలో వెళ్లడం లేద ని ఇరాన్ గత గురువారం ఓ నౌకను డ్రోన్లతో కొట్టడం తాజాగా యుద్ధానికి కారణమైంది. ఇది కచ్చితంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించడమేనని ఇరాన్‌ను అమెరికా నిందించింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ల స్థావరాలపై అమెరికా వెంటనే దాడులు చేసింది. ఈ చర్చే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించడం అంటూ ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొంది.

తమ సార్వభౌమత్వంపై ఇరాన్ దాడి చేస్తున్నదని బెహ్రైన్ ఈ దాడులను ఖం డించింది.  తాము ముందుగానే చెప్పిన మార్గంలో కాకుండా సింగపూర్ పతాకం ఉన్న ఆ కార్గో హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ పయనిస్తున్నందునే దాడి చేయాల్సి వచ్చిందని ఇరాన్ చెబుతున్న మాటల్ని ట్రంప్ కొట్టిపడేశారు. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఇప్పటికీ దాడులకు పాల్పడుతున్నదనేది ఇరాన్‌కు ఆగ్రహం కల్పిస్తున్నది.

ఈ విషయంలో కాల్పుల విరమన ఒప్పందంలోని అంశాన్ని తుంగలో తొక్కి ఇజ్రాయెల్‌కు అమెరికా వత్తాసు పలుకుతున్నదనేది ఇరాన్ వాదన. దక్షిణ లెబనాన్‌లో హెజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికాను పూర్తి పక్షం చేస్తూ దాడులకు తెగబడటం ఇటీవల అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికా బెదిరింపులకు కాస్త మెత్తబడిన నెతన్యాహు, చివరికి శుక్రవారం లెబనాన్‌లో తుది ఒప్పందానికి వచ్చారు.

ఇజ్రాయెల్‌ను అమెరికా పూర్తిగా కట్టడి చేసేందుకే ఇరాన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్టుగా కనిపించింది. అందుకే హోర్ముజ్ జలసంధిని లక్ష్యం చేసుకుని, తన పట్టును మరోసారి చాటుకుంది. శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన యుద్ధం ముప్పు పూర్తి గా తొలగినట్టు కాదని ట్రంప్‌కు కూడా అర్థమైంది. ఇరాన్‌కు ఇంకా యుద్ధం చేసే సామర్థ్యం ఉందని ఆయన స్వయంగా అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడి సంయమనంతో వ్యవహరిస్తే తప్ప ఈ యుద్ధానికి శాశ్వత పరిష్కారం సాధ్యపడదు.