శ్రీరాముడి సొమ్ము కైంకర్యం
ధర్మాన్ని రక్షించడమే హిందూత్వ విశ్వాసాల సారాంశం. ఆ ధర్మం ప్రకారం.. అధర్మానికి పాల్పడేవారు ఎంతటి వారైనా ఉన్నా శిక్ష అనుభవించాల్సిందే. నిందితులు ఎంతటి వీరభక్తులైనా వదిలిపెట్టకూడదని ఇప్పుడు భక్తులు కోరుకుంటున్నారు.
అయోధ్యలో శ్రీరామమందిర ఆలయ నిర్మాణం కోట్లాది మంది భక్తుల కల. మొత్తానికి ఆ కల సాకారమైంది. తద్వారా శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది. రామమందిరమనేది భక్తుల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ఢిల్లీ నుంచి మూ లమూల పల్లె వరకూ ప్రతి పేదవాడి ఇంటినుంచి ఆలయ నిర్మాణానికి విరాళంగా సొమ్ము వెళ్లింది.
విరాళాలు ఇచ్చి వారిలో అత్యంత సంపన్నుల నుంచి సాధారణ రైతు వరకూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి శ్రీరాముడి ఆలయంపై నీలినీడలు కమ్ముకున్నా యి. రాముడి హుండీ కానుకలపై అవినీతి నీడలు అలముకున్నాయి. అక్రమాలు జరిగాయంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. ఈ విషయంపై భక్తుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్నది. ఆలయ ట్రస్టుకు చెందిన సీనియర్ పదాధికారులతో సహా మొత్తం 17 మందిని నిందితులుగా ఉన్నారు. విచారణను కొందరు ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేశారని ఇప్పటికే సిట్ వెల్లడించింది. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు లభించాయంటూ తన నివేదికలో ప్రకటించింది. ఈ వార్త భక్తుల నమ్మకాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నది.
ఎఫ్‌ఐఆర్ నమోదుకు సిఫార్సు
నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ పోలీసుశాఖకు సిట్ సిఫార్సు చేసింది. అవినీతి వెనుక సిట్ ఇప్పటికే బలమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తున్నది. వాటిలో సాంకేతిక, అధికారిక పత్రాలకు సంబంధించిన ఆధారాలున్నట్లు సమాచారం. సాధారణంగా కేవలం రాజకీయ ఆరోపణల ఆధారంగా ఏ విచారణ బృందం ఎఫ్‌ఐఆర్‌కు సిఫార్సు చేయదు.
సిట్ ప్రాథమిక విచారణలో తేల్చిన అంశాలు ఏంటంటే.. ఆలయ నిర్మాణానికి చేపట్టిన విరాళాల సేకరణలో వ్యవస్థాగతమైన లోపాలు జరిగాయి. రశీదుల జారీ, బ్యాంక్ డిపాజిట్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయి. హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియలో ఉద్దేశపూర్వక తప్పులు జరిగాయి. ఆలయంలో అత్యంత పవిత్రంగా, భద్రంగా ఉండాల్సిన హుండీ విరాళాలను ఒక సాధారణ గదిలో ఉండటం అనేక అనుమానా లకు తావిస్తున్నది. ఈ విషయం ఒక పెద్ద కుట్రకు దారితీసేలా ఉంది.
గది వద్ద ఎలాంటి నిఘా లేకపోవడం విస్మయం కలిగిస్తున్నది. పటిష్టమైన ఆడిటింగ్ వ్యవస్థ లేకపో వడం ఇంకా పెద్ద లోపం. అక్రమార్కులు ఆలయ నిధులను దారిమళ్లించేందుకే ఈ విధమైన లొసుగులను ఉపేక్షించారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలకు సిట్ నివేదిక మరింత బలాన్ని చేకూ రుస్తున్నది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ వ్యవస్థలు, ట్రస్ట్‌లపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉంది. అందుకే సిట్.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీస్‌శాఖకు సిఫార్సు చేసింది.
చట్టానికి జవాబు ఎవరిస్తారు?
ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. కోర్టులలో ఆరోపణలు నిరూపితమయ్యే వరకు ఎవరినీ దోషులుగా పరిగణించలేం. నిందితులుగా పేర్కొన్న వారిపై నేరం రుజు వు కావాల్సి ఉంది. కానీ పొగ లేనిదే మంట పుట్టదు అనే సామెత మనకు గుర్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న ఒక ఆలయ ట్రస్టో ఈ స్థాయిలో అక్రమాలు జరగడం విచారకరం. అందుకు సంబంధించిన ఆధారాలు లభించాయంటే అక్కడ పారదర్శకత పూర్తిగా లోపించిందని అర్థమవుతున్నది.
గతంలో కూడా భూముల కొను గోలు వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే భూముల ధరలు కోట్లాది రూపాయలకు పెరిగాయి. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు నేరుగా హుండీ నిధుల నిర్వహణలోనే అవకతవకలు జరిగాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారిక దర్యాప్తు సంస్థ ద్వారా చెప్పడం గమనార్హం. సొమ్ము పై ఆశపడే ముఠా ఒకటి తయారైంది. వారి చేతిలో సమాజంలో ఏ స్థాయిలో అరాచకం సాగుతుందో ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఒకవేళ విచారణలో ఈ 17 మందిపై ఆరోపణలు నిజమని తేలితే అది పెద్ద విపత్తు అవు తుంది.
ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు. కోట్లాది మంది భక్తుల నమ్మకంపై జరిగిన అతిపెద్ద ద్రోహం అవుతుంది. చట్టం ముందు అందరూ సమానులే. దేవుడి పేరు న పదవులు అనుభవిస్తున్న వారైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఈ అక్రమాల ఉదంతం భక్తుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తున్నది. ఎంతో నిష్ఠతో సమర్పించిన కానుకలను దారిమళ్లించడం అన్యాయం. నిధుల నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పవిత్రమైన కార్యం చుట్టూ ఇలాంటి వివాదాలు ముసురుకోవడం ఆందోళనకరం.
వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ఇలాం టి అక్రమాలకు అవకాశం దొరుకుతుంది. దర్యాప్తు సంస్థలు పూర్తి పారదర్శకంగా విచారణ జరపాలి. నిజా నిజాలను సామాన్య భక్తుల ముందు ఉంచాలి. తప్పు చేసిన వా రు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకూడదు. భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వ్యవస్థలపై నమ్మకం పోతే అది సమాజానికి మంచిది కాదు. ఈ అక్రమాలకు కారణమైన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలి. అప్పుడే భక్తుల త్యాగాలకు న్యాయం జరుగుతుంది.
సనాతన ధర్మానికే పెద్ద ప్రశ్న
నిధుల మళ్లింపు వివాదం సనాతన ధర్మం, హిందూత్వ సిద్ధాంతాల నైతిక స్వరూపంపై కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనె త్తుతున్నది. భక్తుల నమ్మకం ప్రకారం.. రామరాజ్యం న్యాయానికి, నిష్కలంకమైన పారద ర్శకతకు నిదర్శనం. అలాంటి రాముడి ఆల య నిధులనే స్వాహా చేయడానికి సాహసించడం క్షమించరాని నేరం.
ఆలయ నిధులను కైంకర్యం చేయడం ఏ రకమైన హైందవ ధర్మం అంటూ దేశవ్యాప్తంగా భక్తులు ప్రశ్నిస్తున్నారు. మతాన్ని, దేవుడి పేరును వాడు కుని దోపిడీ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ధర్మాన్ని రక్షించడమే హిందూత్వ విశ్వాసాల సారాంశం. ఆ ధర్మం ప్రకారం.. అధర్మానికి పాల్పడేవారు ఎంతటి వారైనా ఉన్నా శిక్ష అనుభవించాల్సిందే. నిందితులు ఎంతటి వీరభక్తులైనా వదిలిపెట్టకూడదని ఇప్పుడు భక్తులు కోరుకుంటున్నారు.
వారిని శిక్షించడమే నిజమైన రాజధర్మం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. దేవుడిని, భక్తిని వ్యక్తిగత సంపాదనకు వాడుకోవడం, రాజకీయ ప్రయోజనాలకు పెట్టుబడిగా మా ర్చుకోవడాన్నీ తప్పుబడుతున్నారు. మతాన్ని, భక్తిని అక్రమార్జనకు వినియోగించే వారిపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే.. సనాతన ధర్మం నిలబడుతుందని చెబుతున్నారు.
దర్యాప్తు ముమ్మరం
ఈ అక్రమాల వ్యవహారంలో నిధుల సేకరణ, లెక్కింపు ప్రక్రియలలో ఉన్న తీవ్రమైన లోపాలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఆలయ ట్రస్ట్ నిధులను పర్యవేక్షిం చాల్సిన బాధ్యత కలిగిన కీలక వ్యక్తుల చుట్టూనే దర్యాప్తు తిరుగుతున్నది. హుండీ కానుకల లెక్కింపును పర్యవేక్షించిన రిటైర్డ్ బ్యాంకర్ పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగదును ఒక సాధారణ గదిలో ఉంచడం వెనుక ఉన్న ఉద్దేశాలను దర్యాప్తు సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
భక్తులు సమర్పించిన సొమ్ముకు సరైన రశీదుల జారీ జరగకపోవడం, బ్యాంక్ డిపాజిట్ల నిర్వహణలో పారదర్శకత లోపించడం తీవ్రమైన చర్చకు దారి తీసింది. వ్యవస్థలో ఉన్న ఇలాంటి లొసుగులను వాడుకుని నిధులను దారిమళ్లించారనే కోణంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కుట్రకు బాధ్యులైన వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో పూర్తి నివేది కను సామాన్య భక్తుల ముందు ఉంచాలనే ఒత్తిడి పెరుగుతున్నది. అప్పుడే ఆలయ నిర్వహణలో జవాబుదారీతనం వస్తుందని, భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడం సాధ్యమవుతుందని భక్తులు భావిస్తున్నారు.
సెల్: 98485 59863
వెంకగారి భూమయ్య






