17 April, 2026 | 2:31 AM

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

17-04-2026 12:27 AM

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వాలు ఏదైనా అంతిమంగా ప్రజల సంక్షేమమే ప్రభుత్వాల ధ్యేయమని ఆదిలాబాదు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం స్థానిక ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన మున్సిపల్ స్థాయి సమా వేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్ లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా మున్సిపల్, వైద్య, పోలీస్ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని సమావేశంలో అధికారులు వివరించారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రుణాల చెక్కులను అతిథులు పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించి, అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.

ఈ సం దర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న వ్యాపారాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.  జూన్ 2వ తేదీ నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ’ఇందిరమ్మ భరోసా బీమా’ పథకాన్ని ప్రారంభించబోతుందని, దీని ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే 5 లక్షల రూపాయల బీమా అందుతుందని వివరించారు. 

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంహెచ్‌ఓ రాథోడ్ నరేందర్, డీవైఎస్‌ఓ శ్రీనివాస్, సంక్షేమ అధికారి మిల్కా, ట్రాఫిక్ ఎస్సై దేవేందర్, తహసిల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్నపూర్ణ, స్వాతి, ధోని జ్యోతి, చరణ్ గౌడ్, మున్న జైస్వాల్, గంట జీవన్, విజయ్, ఆత్రం వెంకటేష్, నాగ్ సేన్, మహెబూబ్, సంజయ్, అంగన్వాడీలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.