calender_icon.png 10 November, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు వ్యూహానికి భట్టి పదును!

10-11-2025 12:00:00 AM

  1. ప్రచార చివరి రోజు సుడిగాలి పర్యటన
  2. ఏడు డివిజన్లలో ఇన్‌చార్జుల మంత్రులతో సమీక్షలు
  3. గెలుపే లక్ష్యంగా పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార చివరి రోజున ఉప ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గాన్ని జల్లెడ పట్టారు. ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే, మరోవైపు పోలింగ్ రోజుకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేలా వ్యూ హాలకు పదును పెట్టారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో పర్యటించి, అక్కడ ఇన్చార్జ్లుగా ఉన్న మంత్రుల తో, స్థానిక నాయకులతో వరుస సమీక్షలు నిర్వహించి, కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.

అదివారం ఉదయం ప్రజాభవన్ నుంచి నేరుగా ఎర్రగడ్డ డివిజన్‌లోని మోతీ నగర్‌కు చేరుకున్న భట్టి విక్రమార్క.. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ, కాంగ్రెస్ ప్రభు త్వ పథకాలను వివరిస్తూ, అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటేయాలని అభ్యర్థించారు. అనంతరం డివిజన్ బాధ్యతలు చూస్తున్న జూపల్లితో ప్రత్యేకంగా భేటీ అయి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు.

అక్కడి నుంచి యూసుఫ్‌గూడ డివిజన్‌కు చేరుకుని, మం త్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక నేతలతో రాజకీ య పరిస్థితులపై సమీక్షించారు. ఆ తర్వాత వెంగళరావు నగర్ డివిజన్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితో, రహమత్‌నగర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో, బోరబండలో మంత్రి సీతక్కతో విడివిడిగా సమావేశమై, పోలింగ్ సరళి, ఓటర్ల నాడి, ప్రత్యర్థుల ఎత్తుగడలపై చర్చించారు.

పర్యటన ముగించు కుని యూసు ఫ్‌గూడలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. యూసుఫ్‌గూడ కాంగ్రె స్ కార్యాలయానికి చేరుకున్న భట్టి, అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహం, పోలింగ్ ఏజెంట్ల నియామకం, ప్రత్యర్థుల ఎత్తుగడలను నిలువరించడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించుకోవడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.