10 April, 2026 | 3:20 AM

ఆకాంక్షలకు ప్రతిబింబం మహిళా రిజర్వేషన్ చట్టం

10-04-2026 01:19 AM

ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: మహిళా రిజర్వేషన్ చట్టానికి ప్రతిపాదిత సవరణలు కేవలం శాసనపరమైన ప్రక్రియ మాత్రమే కాదని, భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధా ని నరేంద్ర మోదీ అన్నారు. ‘నారీ శక్తి వంద న అధినియమ్’ (మహిళా రిజర్వేషన్ చట్టం) ఆమోదించేందుకు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ఎక్స్’లో సందేశమిచ్చారు. భారత ప్రజాస్వామ్యాన్ని మరిం త చైతన్యవంతంగా, భాగస్వామ్యంతో కూడినదిగా మార్చేందుకు శాసనసభలలో మహి ళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం అత్యవసరమన్నారు. రిజర్వేషన్‌లో ఆలస్యం చేయడం తగదన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలు మహిళా రిజర్వేషన్‌తోనే నిర్వహించా లని తమ అభిమతమని చెప్పారు.

మహిళలకు రిజర్వేషన్ అంశంపై ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదని, సమాజం పురోగమిస్తున్న తరుణంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నిబంధనను 2023లో రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా తీసుకువచ్చారు. 2027 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తరువాతే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతమున్న లోక్‌సభ సీట్లను 816కు పెంచనున్నారు. ఇందులో 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు.