బీఆర్‌ఎస్ నాయకుల మాటలు హాస్యాస్పదం
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : రైతు భరోసా విధివిధినాలపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మాట్లాడటం చూస్తూంటే ఆయనకు మతిమరుపు ఉందనుకోవాలా, రైతులు మరిచిపోయారని మాట్లాడుతున్నారా అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. రైతుబంధు ఎప్పుడు పంపిణీ చేశారో, ఎంత కాలం పాటు ఇచ్చారో, ఎన్ని పర్యాయాలు పూర్తిగా ఇవ్వకుండా నిలిపివేశారో తెలంగాణ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తూంటే కోడిగుడ్డ మీద ఈకలు ఏరుతున్నట్లు ఉందని విమర్శించారు.
అప్పటి రైతు బంధులో గుట్టలకు, రాళ్లురప్పలకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, జాతీయ రహదారులు, బంజరు భూములకు ఇచ్చి 12 విడతల్లో రూ. 26, 500 కోట్లు ప్రజాధనం దుబారా చేశారని మండిపడ్డారు. ఈప్రభుత్వం రైతు భరోసా అర్హులకు ఇచ్చేందుకు ఆదర్శవంతమైన పథకం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూంటే దానిని విమర్శించడం విచారకరమన్నారు. ఈప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, రైతు భరోసా విషయంలో ఇప్పటికే రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైతే ఎంతో అనుభవం గల నాయకులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.






