ఒవైసీ అధికారిక నివాసంపై నల్లరంగు
అమిత్‌షా పనేనంటూ ఎక్స్‌లో ఒవైసీ పోస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి): ఢిల్లీలో తన అధికారిక నివాసంపై గుర్తు తెలియని ఆగంతకులు నల్లరంగు చల్లారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఎక్స్ ఖతాలో పోస్టు చేశారు. అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని జరిగాయని, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ల నుంచి నిస్సహాయత వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఇదంతా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కనుసన్నల్లోనే జరుగుతున్నదని, ఇప్పటికైనా పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లా దేశంలోని ఎంపీల రక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని, అలాంటి టూబీట్ గూండాలకు నేను ఒక్కటే చెప్తున్నాని, ఇలాంటి చర్యలకు నేను భయపడనని, మీరు రాళ్లు, రంగు విసిరి పారిపోకుండా ఉండాలని తన పోస్టులో తెలిపారు. సావర్కర్ తరహా పిరికి ప్రవర్తనను మానుకోవాలని, తనతో పోరాడాలని సవాల్ విసిరారు.






