25 April, 2026 | 2:11 AM

నలుగురి చేతుల్లోనే థియేటర్లు!

25-04-2026 12:36 AM

‘ఓ అందాల రాక్షసి’ నటుడు షెరాజ్ మెహదీ ఆవేదన

తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం లేదని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తన దర్శకత్వంలో తానే హీరోగా నటించిన ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 24న ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించాం.

ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఒక్క థియేటర్ కూడా ఇవ్వకపోవడం బాధాకరం. తెలుగు సినిమా థియేటర్ వ్యవస్థ కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. నలుగురు రాక్షసుల చేతుల్లో సినిమా థియేటర్లున్నాయి. నాకు ఏమైనా జరిగితే దిల్ రాజు, సురేశ్‌బాబు, బిజిలి, సునీల్ వంటి వారే బాధ్యులవుతారు. ఇక ఐనాక్స్, ఏషియన్ థియేటర్ వ్యవస్థలో కూడా ముందుగా హామీ ఇచ్చినా థియేటర్లు ఇవ్వలేదు.

దీనిపై నేను లీగల్‌గా పోరాటం చేస్తా. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే చిన్న సినిమా నిర్మాణం పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. చిన్న సినిమాల మూవీ మేకర్లు చనిపోతున్నారు. మంచి సినిమాలను కూడా చంపేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని దారుణ పరిస్థితి ఇక్కడ ఉంది. బాలీవుడ్‌లో కూడా ఇలా ఉండదు” అన్నారు.