12 June, 2026 | 1:11 AM

మద్యం తాగించి మహిళ మెడలో పుస్తెల తాడు, ఫోన్ చోరీ

12-06-2026 12:00 AM

ఇద్దరు నిందితుల అరెస్ట్

వేములవాడ, జూన్ 11 (విజయక్రాంతి): పరిచయస్తుడి మాటలు నమ్మి వచ్చిన ఓ మహిళకు మద్యం తాగించి, ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ను దౌర్జన్యంగా లాక్కున్న ఇద్దరు నిందితులను వేము లవాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి  3.6 గ్రాముల బంగారు ముద్దను, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.

వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్లోని తుకారాంగేట్ అడ్డగుట్టకు చెందిన వొల్లెపు జ్యోతికి ఓ వ్యక్తితో పరిచయమైంది. తమ ఇంట్లో జరిగే కార్యక్రమానికి రావాలని అతడు ఆహ్వానించడంతో, ఆమె ఈ నెల 6న వేములవాడకు రాత్రి సమయంలో నందికమాన్ వద్దకు చేరుకున్న ఆమెను ఇద్దరు వ్యక్తులు ఆటోలో కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, బంగారు పుస్తెలు, గుండ్లు, మొబైల్ ఫోన్ను లాక్కొని పరారయ్యారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారంగా వేములవాడ జాతర గ్రౌండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బొడసు అశోక్, దండగుల ప్రవీణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తామే ఈ దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు.  ముందస్తు ప్రణాళికతోనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. నిందితులు దోచుకున్న పుస్తెల తాడును కరిగించి బంగారు గడ్డగా మార్చగా, పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిపై వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్‌ఐ రామ్మోహన్ కేసు నమోదు చేసి  నిందితులను రిమాండ్‌కు పంపారు.