19 April, 2026 | 9:46 AM

కార్యకర్తలే నాయకులు

28-06-2024 01:01 AM

కొందరు పార్టీని వీడినా నష్టమేం లేదు 

కాంగ్రెస్ గద్దెదిగే రోజులు దగ్గరపడ్డాయి

ప్రజల్లో పాలిచ్చే బర్రెను వదులుకుని.. దున్నపోతును తెచ్చుకున్నామన్న బాధ

ఆగమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడతాం 

అప్పటివరకు ఉద్యమం కొనసాగిస్తాం

కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ప్రజలు పాలిచ్చే బర్రెను వొదిలిపెట్టి దున్నపోతును తెచ్చుకున్నట్లు బాధపడుతున్నారని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన అనేక పథకాలు ఇప్పుడు అందడం లేదని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు రావడం లేదని వాపోతున్నారని పేర్కొన్నారు. గురువారం తనను కలిసేందుకు ఎర్రవల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.

కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమైతున్న తెలంగాణను అక్కున చేర్చుకుని మళ్లీ గాడిలో పెట్టేదాకా ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏళ్ల ఉద్యమ ప్రయాణ గమ్యం చేరుకుని, తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికి ఆదర్శవంతమైన పాలనను అందిస్తూ స్వరాష్ట్రంగా 10 సంవత్సరాల అనతి కాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యం చేరుకుందని అన్నారు. ఉద్యమంతోపాటు పాలనలో తెలంగాణ కోసం సాగిన తన 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సి ఉందని స్పష్టం చేశారు.  

తెలంగాణ సాధన కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కన్నా సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదని తెలిపారు. స్వరాష్ట్రం సాధించేనాటికి దిక్కు మొక్కులేని పరిస్థితి ఉండేదని.. స్వపరిపాలనలో సాగునీరు, తాగునీరు కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నామని చెప్పారు. ఇటువంటి కీలక సమయంలో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారని పేర్కొన్నారు. కొన్నికొన్నిసార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అలవికాని హమీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారని తెలిపారు. 

రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పింది 

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశా రు. అయినా ఎలాంటి ఆందోళన అవసరంలేదని, తెలంగాణ కోసం సాగిస్తున్న మన 25 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణం ఆగలేదని కార్యకర్తలకు ఉద్భోదించారు. నాడు ఎన్టీఆర్‌ను తిరిగి ఏవిధంగా ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని, అంతకంటే రెట్టింపు మద్దతుతో గద్దె మీద కూర్చోబెట్టే రోజు త్వరలో వస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజురోజుకూ దిగజారుతున్నదని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్టు ఎక్కేది పోయి మొదటి దశలోనే దిగజారుకుంటూ వస్తున్నదని ఎద్దేవా చేశారు.

నేతలు పోయినా ఏమీకాదు  

రాజకీయ పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందని కేసీఆర్ అన్నారు. నాయకులు   వచ్చి పోతుంటారని, కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి బుల్లెట్ లాంటి కార్యకర్తలు ఉన్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుంటామని తెలిపారు.  ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్ మోసాన్ని గుర్తించి తిరిగి బీఆర్‌ఎస్‌ను ఆదరిస్తారని, అప్పటివరకు ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. పట్టుదలతో ప్రజల నడుమనే జీవించాలని పిలుపునిచ్చారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ నిర్ధేశిత సమయం ప్రకార వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఆర్మూర్, హజూరాబాద్ నియోజకవ ర్గాల నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు.  కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు ప్రశాంత్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, కందాల ఉపేందర్‌రెడ్డి, జహంగీర్, దుండిగల రాజేందర్, పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

ఓమ్ని వ్యాన్ నడిపిన కేసీఆర్  

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్నారు. గురువారం సొంతంగా కారు నడిపి చూడాలని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్ని వ్యాన్‌ను నడిపారు. గత ఏడాది డిసెంబర్ 8న కేసీఆర్ కాలు జారిపడ్డ సంతి తెలిసిందే. దీంతో ఆయనకు తుంటి ఎముక మార్పిడి చికిత్స నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ర సాయంతోనే ప్రచారం చేశారు. ప్రస్తుతం కర్ర సాయం లేకుండానే నడుస్తున్నారు.