3 August, 2026 | 8:33 PM

నిలోఫర్ ఆసుపత్రిలో బెడ్లు కరువు

24-08-2024 12:02 AM
  1. ఒకే బెడ్డుపై ముగ్గురు, నలుగురు పిల్లలు 
  2. నేలపై కూర్చుని చికిత్స పొందుతున్న చిన్నారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23(విజయక్రాంతి): చిన్నారుల చికిత్సకు పెద్దదిక్కైన హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో బెడ్లు కరువయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా చిన్నారులు సీజనల్ వ్యాధులు, విషజ్వరాల భారీన పడుతుండటంతో నిలోఫర్‌లో ఓపీల సంఖ్య పెరుగుతోంది. చికిత్స కోసం వచ్చే చిన్నారులకు బెడ్లు దొరకక వారి తల్లిదండ్రు లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి శుక్రవారం వెలుగుచూసింది. బెడ్డు కోసం గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది.

బెడ్లు సరిపడా లేకపోవడంతో ఒకే బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు, నలుగురు చొప్పున చిన్నారులు ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరి కొంత మందికి నేలపైనే కూర్చుని చికిత్స అం దించాల్సిన దుస్థితి. ఉన్న వ్యాధులు తగ్గడం సంగతి అటుంచితే కొత్త వ్యాధులు సోకుతాయేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నా రు. దీంతో అధికారులపై పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే బెడ్లు దొరకడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి సారించి బెడ్ల సంఖ్యను పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.