3 August, 2026 | 9:28 PM

పాతబస్తీ మెట్రోకు భూసేకరణ వేగవంతం

24-08-2024 12:30 AM
  1. 7.5కి.మీ.ల విస్తరణతో 1,200 ఆస్తులపై ప్రభావం 
  2. ఎనిమిది నెలల్లో భూసేకరణ పూర్తి 
  3. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టబోతున్న మెట్రో ఫేజ్‌ణే పనుల్లో వేగం పుంజుకోనుంది. పాతబస్తీకి మెట్రో (ఎంజీబీఎస్ మధ్య) విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయబోతున్నట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఎంఏఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంజీబీఎస్ మధ్య 7.5 కిలో మీటర్ల వరకు మెట్రోలైన్‌ను విస్తరించడానికి దాదాపు 1200 ఆస్తులపై ప్రభావం ఉంటుందని చెప్పారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం 400 ఆస్తులకు సంబంధించిన భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశామని వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఎనిమిది నెలల సమయం పట్టొచ్చని స్పష్టం చేశారు. 

లైడార్ డ్రోన్ సర్వే పూర్తి

సంప్రదాయంగా వస్తున్న సర్వే పద్ధతులతో పాటు 3డీలో వీక్షించే విధంగా లైడార్ డ్రోన్ సర్వేను కూడా పూర్తి చేసినట్లు ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. దీని వల్ల భూసేకరణలో ప్రభావమయ్యే ఆస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులను కూడా వీక్షించవచ్చని చెప్పారు. ప్రభావిత నిర్మాణాలు, ఆస్తుల విలువను అంచనా వేసేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఇంజనీర్లు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ మెట్రో మార్గంలో 103మతపరమైన, సున్నితమైన కట్టడాల పరిరక్షణకు తగిన అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నిర్మాణాలను విలక్షణ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా సంరక్షించేలా, పిల్లర్లు, స్టేషన్ల వద్ద జాగ్రత్తగా సర్దుబాటు చేస్తూ ముందుకు వెళ్తామన్నారు. భూసేకరణ ప్రభావిత యజమానులు, హెచ్‌ఏఎంఎల్ భూసేకరణ అధికారి కార్యాల యంలో నిర్దిష్ట గడువులోగా తమ అభ్యంతరాలు దాఖలు చేసి, వివరాలు పొందవచ్చన్నారు. 

మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణ

మెట్రో విస్తరణ దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ జరుగుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్ల వద్ద 120అడుగుల వెడల్పుతో విస్తరణ ఉంటుందన్నారు. ప్రస్తుతం దారుల్షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు 50 నుంచి 60 అడుగులు, శాలిబండ జంక్షన్ నుంచి చంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 80అడుగుల వెడల్పు ఉంటుందని పేర్కొన్నారు. దారుల్షిఫా మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి 20 నుంచి 25 అడుగుల చొప్పున రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంటుందన్నారు. శాలిబండ నుంచి చంద్రాయణగుట్ట మధ్య ఒక్కో ఆస్తి 10 అడుగుల వరకు రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.