7 March, 2026 | 9:13 AM

‘ఫాగింగ్’ మిషన్‌కే పొగవేశారు

07-03-2026 01:08 AM

ప్రైవేటు వ్యక్తి ఇంట్లో గ్రామపంచాయతీ సామాగ్రి

మోటార్, స్టార్టర్, ఫాగింగ్ 

మిషన్‌ల అడ్రస్ గల్లంతు       

సామాగ్రి విషయంపై పొంతనలేని సమాధానం చెబుతుందంటూ కార్యదర్శిపై పాలకవర్గ సభ్యుల ఆరోపణలు. 

సామాగ్రి మిస్సింగ్ పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..!             

నామవరం గ్రామ పంచాయతిలో అంతా గందరగోళం 

మోతె, మార్చి 6: బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులు సరైన విధానంను అనుసరించకపోవడంతో సమస్యలు మరింత జటిలమై కూర్చుంటాయి. సరిగ్గా ఇటువంటి పరిస్థితే మండల పరిధిలోని నామవరం గ్రామపంచాయతీలో ప్రస్తుతం కొనసాతుంది.

ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో గ్రామపంచాయతీ సామాగ్రి

నామవరం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం చేపట్టేందుకు గాను పాత గ్రామపంచాయతీ భవనంను అధికారులు కూల్చివేశారు. అయితే పాత భవనంలో ఉన్న సామాగ్రిని వస్తువులను, విధుల్లో ఉన్న కార్యదర్శి వీడియో తీసి ఉన్నతాధికారులకు వస్తువుల వివరాలు తెలియవలసి ఉండాల్సి ఉంది.

అలా చేయకుండా పంచాయతీ కార్యదర్శి తన ఇష్టానుసారంగా వ్యవహరించిందని ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీకి చెందిన కొంత ఇనుప సామాగ్రినీ ఓ ప్రైవేటు వ్యక్తి ఇంట్లో పెట్టీ, మరికొంత సామాగ్రినీ రైతు వేదిక, తాత్కాలికంగా గ్రామపంచాయతీ భవనంగా వాడుకుంటున్న పాఠశాల గదిలో పెట్టినట్లు తెలిసింది. అయితే ఉద్దేశ్యపూర్వకంగా వేరే చోట కొంత భద్రపరిచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

పాలక వర్గానికి పొంతనలేని  సమాధానం :

ఇటీవల ఎన్నికైన పాలకవర్గం గ్రామపంచాయతీ పరిధిలో ఉండాల్సిన మోటార్లు, స్టార్టర్లు, దోమల పిచికారి యంత్రం, సీసీ కెమెరాలకు సంబంధించిన సామాగ్రిని అడిగితే గ్రామసభలో సరైన సమాధానం చెప్పడం లేదని వార్డ్ మెంబర్లు చెబుతున్నారు. దోమల బెడద అధికంగా ఉండటంతో  దోమల నివారణకు ఉపయోగించే పరికరం (ఫాగింగ్ మిషన్) ఏమైందని వార్డ్ మెంబర్లు కార్యదర్శిని అడగ్గా మరమ్మతులకు పంపించినట్లు సమాధానం చెప్పిందని వార్డు మెంబర్లు  చెబుతున్నారు.  మరో సారి  అడిగితే దొంగలు దొంగిలించారని సమాధానం చెబుతున్నదనీ వారే చెబుతుండటం గమనార్హం. 

పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు..!  

గ్రామపంచాయతీకి సంబంధించిన సామాగ్రినీ దొంగలు ఎత్తుకెళ్లారని  గ్రామ పంచాయతీ కార్యదర్శి గత ఇరవై రోజుల క్రితమే స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు స్ధానికంగా పెద్ద చర్చే సాగుతుంది. అయితే సిబ్బంది లోని ఓ వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు చెప్పిందని సమాచారం. అయితే ఇంత జరిగినా విషయం బయటకు రాకుండా ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే విషయంపై స్థానికులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఫిర్యాదు చేసి 20 రోజులైనా పోలీస్ లు విచారణ చేయబట్టక పోవడం ఏంటని పలువురు వార్డు మెంబర్ లే చర్చిస్తున్నట్లు వినికిడి.                                                                                   

పనులు కాక తప్పని అవస్థలు

గ్రామంలో పాగింగ్ మిషన్ లేకపోవడంతో దోమల నివారణకు మందును పిచికారి చేసి పరిస్థితి లేకుండా పోయింది. దీంతో గ్రామంలో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామ సమీపంలో ఉన్న బోరు నుంచి సుమారు కిలోమీటర్ మేర అవసరం లేని పైప్ లైన్ ను ఏర్పాటు చేశారనే విమర్శలు వస్తున్నాయి. అయితే పాలేరు ప్రాంతం నుండి తక్కువ రేటుకి పైపులు తెచ్చి కావాలనే స్వలాభం కోసం ఈ పైప్ లైన్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఈ గ్రామంలో ప్రతి సమస్యను గ్రామసభలో చర్చిస్తున్న అధికారులు సరైన సమాధానం తెలపకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయని పాలకవర్గ సభ్యులు తమ సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శిని చేసిన పనులపై వివరాలు అడిగితే పొంతన లేని సమాధానం చెబుతుందంటూ గ్రామస్తుల నుండి తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయి విచారణలు చేపట్టి కనిపించకుండా పోయిన గ్రామపంచాయతీ సామాగ్రిని ఎక్కడ ఉంది అనేది బహిర్గతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నా దృష్టికి వచ్చింది.                    

గ్రామ పంచాయతీ సామాగ్రినీ దాచిన రైతువేదికకు వేసినా తాళం వేసినట్లు ఉంది. కానీ సామాగ్రి పోయిందని కార్యదర్శి సమాచారం ఇచ్చింది. ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. విచారణ కొనసాగుతుంది. 

టి. ఆంజనేయులు, ఎంపీడీవో, మోతె

విచారణ చేపడుతున్నాం.

నామవరం గ్రామపంచాయతీ సామాగ్రి కనిపించడం లేదని విషయంపై మాకు ఫిర్యాదు అందింది. దీనిపై ప్రస్తుతం విచారణ చేపడుతున్నాం.

- అజయ్ కుమార్, ఎస్త్స్ర, మోతె.