19 April, 2026 | 7:01 AM

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

24-12-2024 12:00 AM

చలికాలం ప్రతి ఒక్కరికీ ఇబ్బందికరమే. ఈ సీజన్ ఎన్నో సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. చలికాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే.. తగిన జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.. 

* చలి కారణంగా రెండు పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ రెండుపూటలా గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. పిల్లలకు సున్నిపిండిలో పసుపు, పాల మీగడ, వెన్న, నువ్వుల నూనె వంటివి చేర్చి శరీరానికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. మహిళలు, వృద్ధులు స్నానం చేసే ముందు కొబ్బరినూనె పట్టించుకుని గ్లిజరిన్ సబ్బు వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటివి తగ్గుతాయి. 

* ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తుంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే, ధరించే ఉన్ని దుస్తుల్ని, కప్పుకునే రగ్గులు, దుప్పట్లను రోజూ ఎండలో పెడుతుండాలి. అలా చేయడం వల్ల అందులో ఉండే దుమ్ము, క్రిములు నశించి అలర్జీల వంటివి దరిచేరవు. బెడ్‌షీట్లను కనీసం వారంలో రెండుసార్లు మార్చుకోవాలి. 

* చలికాలంలో ప్రధానంగా మెడ నరాలు పట్టేయడం, బెణకడం, తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నడి వయసుల వారిని ఈ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అటువంటి వారు ఉదయం, సాయంత్రం పది నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు కాళ్లూ, చేతులూ, మెడ కదుపుతూ వ్యాయామం చేయాలి. గర్భిణులు కూడా ఈ కాలంలో ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. అలా చేయడం వల్ల తల్లి చురుగ్గా ఉండటమే కాకుండా బిడ్డకూ మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

* చలికాలంలో దాహం వేయట్లేదని నీళ్లు తాగడం తగ్గించేస్తాం. శరీరానికి తగిన నీటిని అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అవసరమైనంత నీటిని తాగాలి. చిన్నారు లు, గర్భిణులు, వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండదు కాబట్టి నీటిని కాచి వడబోసుకుని తాగాలి.