19 April, 2026 | 8:44 AM

డయాబెటిక్‌ని తగ్గించే యోగాసనాలు!

24-12-2024 12:00 AM

ఈరోజుల్లో మానసిక ఒత్తిడితో చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరక శ్రమ లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు. అంతేకాదు అన్ని రోగాలను పక్కన పెడితే.. ముందు వరుసలో నిలబడేది మాత్రం డయాబెటిస్ అని చెబుతున్నారు నిపుణులు. ఒక్కసారి వస్తే శరీరంలో తిష్ట వేస్తుంది. దీనినుంచి బయటపడాలంటే రోజూ గంటపాటు కింది ఆసనాలు వేస్తే సరిపోతుందని చెబుతున్నారు వ్యాయామ నిపుణులు.

శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. మనదేశంలో సుమారు పది కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించడానికి రోజూ మందులు తీసుకోవాల్సిందే. అయితే చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి యోగా ఆసనాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు దీనిపై పరిశోధనలు చేశారు. రోజూ 50 నిమిషాల యోగా చేయడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ పునీత్ మిశ్రా ఏం చెబుతున్నారంటే.. యోగా చేయడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహ రోగులు మూడు నెలల పాటు యోగా చేయడం వల్ల వారి శరీరంలో హెచ్‌బీ1 ఏసీ స్థాయి గణనీయంగా తగ్గింది. ఈ రోగులకు మందులతో పాటు యోగా చేసిన వారి షుగర్ స్థాయి అదుపులో ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనలో 50 నిమిషాల యోగా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా కొన్ని ప్రధాన యోగాసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలన్నీ రోజూ ఒక్కో నిమిషం చొప్పున వేస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. 

కటిచ్క్రాసనం..

కటిచ్క్రాసనం చేయడానికి, ముందుగా నిటారుగా నిలబడి, రెండు కాళ్లను భుజం వెడల్పుగా ఉంచాలి. రెండు చేతులను కుడి, ఎడమ వైపులా ఉంచి, శ్వాస తీసుకుంటూ, చేతులను ముందు వైపుకు పైకి లేపాలి. వాటిని భుజాలకు అనుగుణంగా ఉంచాలి. ఇప్పుడు నడుమును కుడి వైపుకు తిప్పాలి. ఆ తర్వాత రెండు చేతులను కుడి వైపుకు తీసుకుని కుడివైపుకి తాకడానికి ప్రయత్నించాలి. ఎడమ వైపుకు కూడా ఇలాగే చేయాలి. 

ఉపయోగాలు

* పెద్దవారిలో వచ్చే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. తద్వారా మానసిక ప్రశాంతత అందుతుంది. 

* శ్వాస వ్యవస్థ మెరుగుపడటంతో పాటుగా మణికట్టు, భుజాలు, వెన్నెముక దృఢత్వం అవుతాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. 

* మధుమేహంతో పాటుగా సయాటికా ఉన్నవారికి ఈ ఆసనం బాగా పని చేస్తుంది. ఈ ఆసనం వేయడం ద్వారా కాలేయానికి మంచిది. శరీర పైభాగాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా జరుగుతుంది. 

 -అనిత అత్యాల,
అనిత యోగ అకాడమీ
6309800109