17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఈ సార్లు వేరీ స్పెషల్!

22-06-2025 12:00 AM

అక్కడ చదువు ‘మొక్కు’బడి కాదు

పేద పిల్లలకు ఉపాధ్యాయుల చేయూత

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు చాలాచోట్ల బడికి వచ్చామా.. తమ సబ్జెక్టును పిల్లలకు బోధించామా.. ఇంటికి వెళ్లామా అన్న తరహాలో ఉంటారు. ఇలా మొక్కు‘బడి’గా కాకుండా మహబూబాబాద్ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేద పిల్లలకు విద్యాబోధన చేయడంతో పాటు వారికి కనీస వసతులు కల్పించి, తమవంతు చేయూతనందిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు జిల్లా పరిషత్ పాఠశాలలో 170 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, వారికి తగ్గట్టుగా పాఠశాలలో టాయిలెట్లు లేకపోవడం గమనించిన పీఈటీ కాశీనాథ్ స్థానికంగా ఉన్న వనరులతో మూత్రశాల ఏర్పాటు చేశారు. ఇంటర్వెల్‌లో మగ పిల్లలంతా పాఠశాలలో ఉన్న ఒకటి రెండు టాయిలెట్లు సరిపోకపోవడంతో పాఠశాలకు దూరంగా మూత్ర విసర్జన కోసం వెళ్లి వస్తుండటం వల్ల విద్యా బోధనకు ఆటంకంగా మారింది.

దీంతో బాలుర కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించే బడ్జెట్ లేకపోవడంతో ఉపాధ్యాయుల సహకారంతో ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలను కట్ చేసి గోడకు మేకులతో అమర్చి, దిగువ భాగాన విసర్జించిన మూత్రం బయటకు వెళ్లేందుకు పీవీసీ పైపు ఏర్పాటు చేసి, పాఠశాలలో మరమ్మతుల కోసం తెచ్చిన ఇసుక, కంకర, రెండు సిమెంట్ బస్తాలతో కలిపి ప్లాట్‌ఫారం ఏర్పాటు చేశారు. పనికిరాని సిమెంట్ రేకులను చుట్టూ దడిగా ఏర్పాటుచేసి, మూత్ర విసర్జన అనంతరం దుర్వాసన రాకుండా ప్రత్యేకంగా ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు.

ఇదంతా కేవలం రూ.3 వేలతో పూర్తయింది. ఏకకాలంలో పదిమంది విద్యార్థులు మూత్ర విసర్జన చేయడం వల్ల ఇప్పుడు ఇంటర్వెల్ ముగియగానే విద్యార్థులంతా తరగతిగదికి చేరుతున్నారు. స్థానిక వనరులతో, తక్కువ ఖర్చుతో, ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో పీఈటీ కాశీనాథ్ చేసిన ఆలోచన వల్ల రెండేళ్లుగా విద్యార్థులకు ‘మరుగు’ ఇబ్బంది కనుమరుగైంది.

పిల్లల కోసం టీచరే డ్రైవరైన వేళ..

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాజనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలనీ నుంచి విద్యార్థులను బడికి చేర్చడానికి సొంతంగా మారుతి వ్యాన్ సమకూర్చారు. అలాగే ప్రతిరోజు పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చి, తిరిగి ఇంటికి చేర్చడానికి ఉపాధ్యా యులు తలా కొంత డబ్బు వేసుకొని, ఈ వ్యాన్‌ను ఏర్పాటు చేసుకోవడం విశేషం. పాఠశాలకు కాలనీ నుంచి విద్యార్థులు బడికి రావడం దూరభారం కావడంతో పిల్లల హాజరు సంఖ్య తగ్గుతుంది.

ప్రతిరోజు పిల్లల్ని తీసుకొవచ్చి బడి వద్ద దిగబెట్టడం సాధ్యం కాదని, వ్యవసాయ పనులకు వెళ్లాల్సి ఉంటుందని పిల్లల తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. పిల్లలు బడికి వెళ్లకుండా ఇంటివద్దే ఆటపాటలతో ఆలక్షేపం చేస్తుండటంతో సమస్యను గుర్తించిన ఉపాధ్యాయు డు మహమ్మద్ యాకూబ్  రూ.70 వేల ఖర్చుతో మారుతి వ్యాన్ కొనుగోలు చేసి, ప్రతిరోజు పెట్రోల్‌కు సొంతంగా కొంతడబ్బు వెచ్చించి, తనే డ్రైవర్‌గా మారి ఈ విద్యా సంవత్సరంలో తండా, కాలనీ నుంచి పాఠశాలకు రోజు విద్యార్థులను తీసుకొచ్చి, తిరిగి ఇంటి వద్ద దిగబెడుతున్నారు. దీనితో పిల్లలు రోజూ స్కూల్‌కు వస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

 బండి సంపత్‌కుమార్, మహబూబాబాద్