11 May, 2026 | 1:38 AM

కాలుస్తున్నారు.. ముప్పు తెస్తున్నారు!

22-06-2024 03:38 AM
  • వేల ఎకరాల్లో పంట వ్యర్థాల కాల్చివేత 
  • పర్యావరణంపై తీవ్ర ప్రభావం
  • వేడికి భూసారం దెబ్బతినే అవకాశం

జయశంకర్ భూపాలపల్లి, జూన్ ౨౧ (విజయక్రాంతి): అవగాహన లేమితో రైతులు చేపట్టే పలు చర్యలు పర్యావరణానికి ముప్పును కలిగిస్తున్నాయి. పంట కాలం పూర్తయిన తర్వాత పంట అవశేషాలు, వ్యర్థాలను కాల్చివేస్తూ పర్యావరణానికి విఘాతం కల్గిస్తున్నారు. ఏటా వరి, పత్తి, కంది, మొక్కజొన్నలాంటి పంటలను సాగు చేస్తూ వాటి వ్యర్థాలను కాల్చి వేస్తున్నారు. దీంతో నేల సారం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి హానీ కలుగుతున్నది. 

విషవాయువులతో గాలి కాలుష్యం

పొలాలు, చేన్లలోని కాల్చివేసిన పంట అవశేషాలు, వ్యర్థాలు బూడిదవుతాయి. ఈ సమయంలో నేలతో పాటు పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వ్యర్థాలను కాల్చితే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, సల్పర్ డై ఆక్సైడ్, అమ్మోనియం వంటి విషవాయువులు గాలిలో కలిసి కలుషితం చేస్తాయి. సాధారణంగా ఒక ఎకరంలో వ్యర్థాలను కాల్చితే 60కిలోల కార్బన్ మోనాక్సైడ్, 1400కిలోల కార్బన్ డై ఆక్సైడ్, 3కిలోల సూక్ష్మదూళి కణాలు, బూడిద, సల్పర్ డై ఆక్సైడ్‌లు గాలిలో కలిసిపోతాయి.

వందలు, వేల ఎకరాల్లో ఇలా చేయడం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుం ది. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రధాన పంటల ద్వారా ఏటా సుమారుగా 293.5లక్షల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటల్లో 91.6శాతం వ్యర్థాలు ఏర్పడుతాయి. వరిలో 30 నుంచి 40శాతం, పత్తిలో 90 నుంచి 95శాతం వ్య ర్థాలను ఏటా రైతులు కాల్చి బూడిద చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

వరి, పత్తి కట్టెలతో ఎంతో ప్రయోజనం

వరి, పత్తి పంటల వ్యర్థాలతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. వరి కోత తర్వాత గడ్డిని పొలంలో వదిలేసి సింగిల్ సూపర్ పాస్పేట్ లేదా వేస్ట్ డి కంపోజర్ లేదా పూసా డి కంపోజర్‌ను చల్లితే 15 కుళ్లిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి దుక్కి దున్నకుండానే ఆరుతడి పద్ధతిలో విత్తనాలు విత్తుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పత్తి కట్టెను రోటావేటర్, స్లాషర్ లేక మల్టీ క్రాప్ షెడ్డర్‌తో కలియ దున్నితే 12 నత్రజని, 1.6 కిలోల ఫాస్పరస్, పటాస్, 12.2 కిలోలు ఒక హెక్టారుకు అందుతుంది. ఇలాచేయడం ద్వారా ఎరువుల వాడకం కూడా తగ్గి భూమి సారవంతంగా ఉండి పంట దిగుబడికి దోహపడుతుంది. కలియదున్నడమే అన్ని విధాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యర్థాలను కలియ దున్నితే ప్రయోజనం

పంట వ్యర్థాలను కాల్చకుండా కలియ దున్నితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. పంట అవశేషాలు, వ్యర్థాలను కలియ దున్నితే నేల సారవంతం అవుతుంది. కాల్చి వేయడంతో భూమిలో సేంద్రియ కర్బనం, పోషకాలు క్షీణిస్తాయి. నేల భూసారం తగ్గి, సూక్ష్మజీవులు, కీటకాలు నశించి పోయి పంటలు సరిగా పండవు. 

 వ్యవసాయ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం