ఫైళ్లు దాటని నీళ్ల ప్రాజెక్టులు
- ఎత్తిపోతలపైనే సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు
- సర్వేలకే పరిమితమైన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు
- పనులు ప్రారంభించాలని సర్కారుకు కర్షకుల విన్నపాలు
సంగారెడ్డి, జూన్ 21 (విజయ క్రాంతి) : సాగునీటి రంగానికి గత ప్రభుత్వం పెద్దపీట వేసింది. బీడు భూములను సస్యశ్యామలం చేసే సంకల్పంతో ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలో మంజీర నదిపై రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. సర్వేలు కూడా పూర్తిదశకు చేరుకున్నాయి. ఇంతలో ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టులపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ ప్రాజెక్టులపైనే ఆశలు పెట్టుకున్న రైతులు ఎత్తిపోతలను ఉత్తిమాటలు చేయొద్దని కోరుతున్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గా ల పరిధిలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. కాళేశ్వరం లింక్ కు అనుసంధానంగా ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. 6,727 ఎకరాల భూమి అవసరమని నిర్ధారించారు. భూసేకరణకు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. అంతేకాదు, సంగమేశ్వరకు రూ. 2,653 కోట్లు, బసవేశ్వరకు రూ. 1,774 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు కూడా వేశారు. పాలనాపరమైన అనుమతులు కూడా జారీ చేశారు.
మూడు నియోజకవర్గాలు.. మూడు లక్షలు
ఈ రెండు ప్రాజెక్టులతో మూడు నియోజకవర్గాల్లో మూడు లక్షలకు పైగా ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఝరాసంగంలో 24,535 ఎకరాలు, న్యాల్‌కల్ 21,880 ఎకరాలు, కోహీర్ 11,429 ఎకరాలు. జహీరాబాద్ 22,415, మొగుడంపల్లి 23వేల ఎకరాలకు సాగునీటి సౌలభ్యం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అలాగే ఆందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్‌లో 29940 ఎకరాలు, మునిపల్లి 35876 ఎకరాలు, రేగోడ 1700 ఎకరాలు, వట్‌పల్లి 350 ఎకరాలు, సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట 38,850, కొండాపూర్ 12767, కంది 2760, సంగారెడ్డి 2211 ఎకరాలకు సాగు నీరు సరఫరా చేసేందుకు సర్వే చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్‌లో 19300 ఎకరాలు , మనూర్ 20,500 ఎకరాలు, నాగిల్‌గిద్ద 17,500 ఎకరాలు, సిర్గాపూర్ 18535, కంగ్టి 31915, కల్హేర్ 11200 ఎకరాలలు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
కాళేశ్వరంలో భాగం..
కాళేశ్వరం జలాలను మంజీర నదిలో నింపి సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే లక్ష్యంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. మునిపల్లి మండలంలో సంగమేశ్వరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ. 2,653 కోట్లు పరిపాలన అనుమతులు కూడా జారీ అయ్యాయి. ఎత్తిపోతల పథకం పనులు చేసేందుకు మెగా ఇంజనీరింగ్ ఇంఫ్రోస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రూ.2,337 కోట్లతో అగ్రిమెంట్ కూడా కుదిరింది. భూసేకరణ పనులు కూడా మొదలయ్యాయి. ఈ లోగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సర్వేకు బ్రేక్ పడింది.
పనులు ప్రారంభించాలి
సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి మంజీరా నది ప్రవహిస్తున్న జిల్లా రైతులకు సాగు నీరు లభించడం లేదు. మంజీరా నీటిని వ్యవసాయంకు అందించకపోవడంతో రైతులు వర్షధారంగా పంటలు సాగు చేస్తున్నారు. వర్షాలు పడకపోతే రైతులు కష్టాలు పడాల్సి వస్తుంది.






