09-02-2026 12:00:00 AM
ప్రధాన రహదారి గుంతలమయం...
15 కిలోమీటర్ల దూరానికి.. గంటకుపైగా ప్రయాణం
ఉట్నూర్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాలకు వెళ్లే రోడ్లతో పాటు ప్రధాన రహదారులు సైతం గుంతలమ యం కావడంతో ప్రయాణికులు ప్రయాణం అంటేనే చాలు జంకుతున్నారు. ప్రమాదకరంగా మారిన రోడ్లపై ప్రయాణంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉట్నూర్ క్రాస్ రోడ్ నుండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రవాణా సౌకర్యం కోసం నిర్మించిన తారు రోడ్డు అడుగు అడుగున గుంతలమ యం అయింది.
ఉట్నూర్ క్రాస్ రోడ్ నుండి ఆసిఫాబాద్ వరకు 70 కిలోమీటర్ల తారు రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు.
ఈ రహదారితో పాటు ఉట్నూర్ నుండి మం చిర్యాల జిల్లాకు వెళ్లే తారు రోడ్డు ఉట్నూర్ మండలంలోని కొత్తగూడెం నుండి నిర్మల్ జిల్లా సరిహద్దు వరకు ఉన్న తార్ రోడ్ గుంతలమయం కావడంతో ప్రయాణం ఇబ్బందిగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు, పాలకులు ఈ రెండు రహదారులకు మరమ్మత్తులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పలు జిల్లాలకు వెళ్ళే రహదారి...
ఉట్నూర్ నుండి మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు ఈ రోడ్డు గుండా ప్రతిరోజు వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. గుంతల రోడ్డుపై ప్రయాణం చేస్తూ రోడ్లు ఇలా ఉంటే ఎలా అని ప్రయాణికులు అంటున్నారు. ఉట్నూర్ నుండి బీర్సాపెట్ వరకు 15 కిలోమీటర్ల దూరంలో గంటకు పైగా ప్రయాణించవలసి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.. ఇప్పటికైన ఆర్ అండ్ బి అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.