16 June, 2026 | 2:04 AM

ప్రణాళిక లేకుండానే కూల్చారు!

16-06-2026 01:02 AM
  1. ఈఎస్‌ఐలో వింత పరిస్థితి
  2. సనత్‌నగర్‌లో 450 కుటుంబాలున్న క్వార్టర్లను ధ్వంసం చేసిన అధికారులు
  3. రెండేండ్లు అవుతున్నా ప్రణాళికలను సిద్ధం చేయని ఢిల్లీ అధికారులు
  4. రూ.5 వేల కోట్లతో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఎక్స్‌టెన్షన్ అంటూ మొదట్లో ప్రచారం
  5. పారామెడికల్, నర్సింగ్ కళాశాల, స్టాఫ్ కోసం 20 అంతస్తుల ట్విన్ టవర్స్ అంటూ మరో ప్రణాళిక
  6. నిస్తేజంగా ఢిల్లీలోని ఈఎస్‌ఐ డీజీ కార్యాలయం
  7. ఎటూ తేల్చని ఉన్నతాధికారులు

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఏదైనా పని చేయాలంటే ముందుగా ప్రణాళిక అవసరం. ప్రభుత్వ శాఖల్లో ఇది పక్కాగా అమ లు చేస్తారు. కానీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ (ఈఎస్‌ఐ)లో మాత్రం ఇందుకు విరుద్ధం గా జరుగుతోంది. ఎలాంటి ప్రణాళికలు వేయకుండా భవిష్యత్తులో ఏం చేస్తామనేది నిర్ణ యం తీసుకోకముందే ఉద్యోగుల క్వార్టర్లను కూల్చేశారు. కూల్చివేసిన తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు వేసి, పనులు మొదలు పెట్టారా అంటే అదీ లేదు. ఇంకా ప్రణాళికలనే రూపొందించకుండా రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ తాత్సారం చేస్తున్నారు. ఇదీ స్థూలంగా సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రి ఆవరణలో క్వార్టర్ల కూల్చివేతల తతంగం తీరు.

రూ.5 వేల కోట్ల ప్రణాళిక ఏదీ?

క్వార్టర్లను కూల్చేసే ముందే 50 ఎకరాల్లో ఏం చేయాలనేది ఉన్నతాధికారులకు ప్రణాళిక ఉండాలి. కానీ ఢిల్లీలోని ఈఎస్‌ఐ డైరెక్టర్ జనరల్‌కుగానీ, ఆ కార్యాలయంలోని ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి ప్రణాళికలు లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై తాత్సా రం చేస్తూ వస్తున్నారు. మొదట్లో ఈ స్థలంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఎక్స్‌టెన్షన్ భవనాలను నిర్మిస్తామని అన్నారు.ఇందుకోసం రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు ప్రచారం జరిగింది.

అయితే ఆ దిశగా ఒక్క అడుగుకూ డా పడలేదు. కాలం గడిచేకొద్దీ ఈ స్థలంలో పారా మెడికల్, నర్సింగ్ కళాశాలలను నిర్మిస్తారని ప్రచారం జరిగింది. పైగా ఈఎస్‌ఐ స్టాఫ్ నివసించేందుకు వీలుగా 20 అంతస్తులతో రెండు (ట్విన్) టవర్లను నిర్మిస్తామని కూడా ఉన్నతాధికారులు తమ తమ ఆలోచనలను ప్రచారం చేశారు.కానీ ఏ ఒక్క ప్రణాళిక కూడా ముందుకు పడలేదు. కనీసం తట్టెడు మట్టికూడా తీయలేదు. కానీ ఉన్న క్వార్టర్లను కూల్చి వేసి సుమారు రెండు సంవత్సరాల కాలం గడుస్తోంది. తరువాత ఏం చేస్తారనేదానిపై అతీగతీ లేదు.

నిర్లక్ష్యంగా ఢిల్లీలోని డీజీ కార్యాలయం

సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రితోపాటు ఇప్పుడు క్వార్టర్లు కూల్చివేసిన సుమా రు 50 నుంచి 60 ఎకరాల స్థలమంతా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈఎస్‌ఐ (కార్పొరేట్) డైరెక్టర్ జనరల్ పరిధిలోకే వస్తుం ది. సనత్‌నగర్ ఈఎస్‌ఐ పరిధిలోని క్వార్టర్లను కూల్చివేసి రెండు సంవత్సరాలు అవుతున్నా ఢిల్లీలోని డీజీ కార్యాలయంలో ఎలాంటి కదలిక కనపడటం లేదు. ఉన్న క్వార్టర్లను కూల్చేయడంలో ఉన్న శ్రద్ధ తరువాత ప్రణాళికను అమలు చేయడంపై కనపడటం లేదు. రెండేండ్లు అవుతున్నా కనీసం ఇప్పటి వరకు ఏం నిర్మించాలనే ప్రణాళిక కూడా రూపుదిద్దుకోలేదంటే ఉన్నతాధికా రుల్లో ఎంతటి నిర్లక్ష్యం ఉన్నదో అర్థమవుతుంది.

ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుని క్వార్టర్లను కూల్చివేస్తే గడిచిన రెండేండ్లలో కనీసం సగానికిపైగా పనులు పూర్తయ్యే వి. ఒకవేళ పారా మెడికల్, నర్సింగ్ కళాశాలను మొదలుపెట్టి ఉంటే వచ్చే ఒకట్రెండు సంవత్సరాల్లో తెలంగాణ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేవి. పోనీ స్టాఫ్ క్వార్టర్లు నిర్మించినా ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చేవి. ప్రణాళిక వేసేంత వరకైనా క్వార్టర్లు కూల్చకుండా ఉంటే సుమారు 450 ఈఎస్‌ఐ ఉద్యోగుల కుటుంబాలు మరికొంత కాలమై నా అక్కడ నివసిస్తూ ఉండేవారేమో. కానీ ఉన్నతాధికారుల్లో నిస్తేజం, నిర్లక్ష్యం కారణంగా ప్రణాళికకూడా సిద్ధం కాలేదు. రూ.5 వేల కోట్లతో ఏం చేస్తారనేది ఆఖరికి డీజీ  కార్యాలయంలోని ఉన్నతాధికారులకుకూడా తెలయదు. కానీ ఉన్న క్వార్టర్లను మాత్రం నేలమట్టం చేశారు. ఇప్పుడు చెట్లు చేమలు పెరిగి కార్లు, ఇతర వాహనాల పార్కింగ్ కోసం కొన్నిసార్లు తాగుబోతులకు అడ్డాగా మారుతుందం టూ ఉద్యోగులే వాపోతున్నారు. ఇదీ స్థూలం గా ఈఎస్‌ఐ పనితీరు! 

450 కుటుంబాలు చెల్లాచెదురు

సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రి ఆవరణలో సుమారు 100 వరకు క్వార్ట ర్లు ఉండేవి. వీటిలో సుమారు 450 వర కు ఈఎస్‌ఐ (స్టేట్, సెంట్రల్) ఉద్యోగులు తమ కుటుంబాలతో నివసిస్తూ, ఉద్యోగా లు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఢిల్లీలోని ఉన్నతాధికారులకు ఎలాంటి ఆలో చనలు వచ్చాయో తెలియదుకానీ ఈ క్వార్టర్లు అన్నీ కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

2024లో ఈ క్వార్టర్లను కూల్చేశారు. సుమారు 50 నుంచి 60 ఎకరాల స్థలంలోని క్వార్టర్లను కూల్చేయడంతో అందులో దశాబ్దాలుగా ఉంటున్న ఈఎస్‌ఐ ఉద్యోగుల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. అద్దె ఇండ్లలోకి వెళ్లిపో యారు. కొందరు సొంత ఇండ్లను నిర్మించుకున్నారు. దాదాపు 450 కుటుంబాలు ఈ క్వార్టర్లను కూల్చివేయడంతో ఇతర ప్రాంతాల్లోకి, ఈఎస్‌ఐ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్లిపోయాయి.