16 June, 2026 | 2:04 AM

దుద్దెడ రాజీవ్ రహదారి.. యమలోకానికి దారి

16-06-2026 01:02 AM

సి ఆకారపు ప్రాణాంతకం మలుపు

ప్రాణాలు కోల్పోతున్నా స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు

దుద్దెడ బైపాస్ నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్

కొండపాక, జూన్ 15: హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారి దుద్దేడ వద్ద ప్రమాదాలకు నిలయంగా మారింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సి-ఆకారపు మలుపు నిత్యం రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. అతివేగంతో దూసుకొచ్చే వాహనాలు అకస్మాత్తు గా వచ్చే మలుపును గుర్తించలేక నియంత్రణ కోల్పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ మలుపు వద్ద ఎన్నో వాహనా లు బోల్తాపడటం, ఒకదానికొకటి ఢీకొనడం, పాదాచారులు ప్రమాదాలకు గురై ప్రాణా లు కోల్పోవడం వంటి ఘటనలు కొక్కొల్లలుగా ఉన్నాయి. ఇంటి ముందు అరుగుపై కూర్చున్న ఇద్దరు మహిళలు, ఓ చిన్నారిపైకి అదుపుతప్పిన కారు దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇటీవల జరిగింది. ఈ ప్రమాదం గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంక ఎంతమంది ప్రాణాలు కోల్పోతే అధికారులు స్పందిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సాహసంగామారిన ఆదివారం సంత

దుద్దెడలో ప్రతి ఆదివారం కూరగాయల సంత జరుగుతుంది. మార్కెట్కు వెళ్లే ప్రజలు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తుంది. ఎటు నుంచి ఏ వాహనం వేగంగా వచ్చి ఢీకొంటుందో అనే అయోమయంలో ఉన్నారు.

ప్రమాదాలకు ప్రధాన కారణాలు

రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరనలో ఇక్కడ ఉన్న ప్రమాదకరమైన సి-ఆకారపు మలుపును సరిచేయకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. హైవే వేగానికి అనుగుణంగా ఉండాల్సిన సూపర్ ఎలివేషన్ (మలుపు వద్ద రోడ్డు వంపు) సరిగా లేకపోవడంతో వేగంగా వచ్చే వాహనాలు నియంత్రణ కోల్పోతున్నాయి.

రాజీవ్ రహదారిపై వాహనాలు సాధారణంగా గంటకు 80 నుంచి 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుండగా, నేరుగా ఉన్న రహదారిపై అకస్మాత్తుగా వచ్చే ఈ మలుపును డ్రైవర్లు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. మలుపు ఉన్నట్లు ముందుగానే హెచ్చరించే రేడియం సైన్ బోర్డులు, బ్లింకర్ లైట్లు, స్పీడ్ వార్నింగ్ సూచికలు తగినన్ని లేకపోవడం వల్ల ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.

డివైడర్ల ఎత్తు, వెడల్పు కూడా సరిపోకపోవడంతో నియంత్రణ కోల్పోయిన వాహనాలు అవతలి వైపుకు దూసుకెళ్లి ఎదురుగా వచ్చే వాహనాలు, ఇళ్లు, విద్యుత్ స్తంభాలను ఢీకొంటున్నాయి. దుద్దెడ గ్రామం వద్ద స్థానిక ప్రజలు, పాదాచారులు, ఇతర గ్రామాల నుంచి వచ్చే వాహనాలు తరచూ హైవేను దాటాల్సి రావడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. వేగంగా వచ్చే వాహనదారులు అకస్మాత్తుగా ఎదురయ్యే పాదాచారులను తప్పించబోయే క్రమంలో ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

బైపాస్ రహదారే శాశ్వత పరిష్కారం

దుద్దెడ రాజీవ్ రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారంగా గ్రామం బయట నుంచి బైపాస్ రహదారి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకరమైన సి-ఆకారపు మలుపును పూర్తిగా తొలగించి హైవే ప్రమాణాలకు అనుగుణంగా రహదారిని పునర్నిర్మించాలని కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు, బ్లింకర్ లైట్లు, రక్షణ గోడలు, మెరుగైన డివైడర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రఘునందన్ రావుకు గ్రామస్తుల వినతి

గతంలో దుద్దెడ శివాలయాన్ని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు గ్రామస్తులు ఈ సమస్యను తీసుకెళ్లారు. ప్రమాదాల నివారణ కోసం దుద్దెడ బైపాస్ రహదారి అవసరాన్ని వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ తీర్మానం చేసి ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించాలని ఎంపీ కోరారు.

గ్రామంలో ప్రజలు అవసరాలకు అనుగుణంగా విస్తరణ జరుగుతుందని గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ వివరించారు. ప్రతి రోజు విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే రోడ్డు దాటాల్సిందే. మహిళలు విద్యార్థులు రోడ్డు దాటాల్సిన పరిస్థితుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అని పలుమార్లు అధికారులకు వివరించడం జరిగింది అయినా ప్రభుత్వం స్పందించి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్ ఉంది. ఇటీవల జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలకు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. 

స్థానిక ప్రజలే అంగీకరించడం లేదు..

రాజీవ్ రహదారి నిర్మాణంలో బైపాస్ రోడ్డు నిర్మించేందుకు అప్పటి మంత్రి హరీష్ రావు సర్వే చేయాలని ఆదేశించారు. కానీ దుద్దెడ గ్రామస్తులు బైపాస్ రోడ్డు ఏర్పాటుకు అంగీకరించలేదు. దాంతో గ్రామంలో ఉన్న రెండు వరసల రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించాల్సి వచ్చింది. దుద్దేడ ప్రజలు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకరిస్తే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రహదారి మార్పుకు తమ వంతు కృషి చేస్తామని విజయక్రాంతికి  వివరించారు.

 పివి వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి కన్సల్టెన్సీ సర్వీస్ ఇంచార్జ్