calender_icon.png 18 September, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

18-09-2025 01:44:50 AM

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క.

ములుగు, సెప్టెంబరు17 (విజయక్రాంతి): ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి,జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు.

వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం మంత్రి అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన  ఎస్పీ డాక్టర్.శబరీష్.పి ములుగు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్.శబరీష్.పి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజల భద్రత,శాంతి భద్రతా పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు. 

ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటపురం, మంగపేట మండలాల్లో .. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ 

మహబూబాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలు మెచ్చిన విధంగా ప్రజాపాలన సాగిస్తున్నట్లు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో బుధవారం ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ. 500 కే వంటగ్యాస్ సిలెండర్ పంపిణీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకము, రైతన్నలకు రూ. 2 లక్షల వరకూ రుణ మాఫీ,రైతు భరోసా, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు మంజూరు, అదనంగా కుటుంబ సభ్యుల నమోదు, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భీమా, విద్యా వ్యవస్థను మెరుగు పరచడానికి ‘తెలంగాణ విద్యా కమిషన్’ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్.సి,ఎస్.టి, బి.సి, మైనారిటీ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు గత సంవత్సరం నుండి కాస్మోటిక్, చార్జీలు పెంచినట్లు చెప్పారు. గ్రామ స్థాయిలో పాలనను బలోపేతం చేయడానికి, ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడం కొరకు ప్రభుత్వం ప్రతీ రెవెన్యు గ్రామానికి గ్రామ పాలన అధికారులను నియమించడం జరిగిందన్నారు.

రాబోవు కాలంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత పారదర్శకంగా సులభతరంగా ప్రజలకు అందించి, ప్రజా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కే. అనిల్ కుమార్, జిల్లా పుర ప్రముఖులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.

జనగామలో..

జనగామ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా కలెక్టరెట్ లో   వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు  ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య ముఖ్య అతిధిగా విచ్చేయగా.. ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ష లోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పూలబొకే ను అందించి ఘన స్వాగతం పలికిన అనంతరం..

పోలీస్ అధికారుల నుండి ముఖ్య అతిధి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య  జాతీయ జెండా ను ఆవిష్కరించిన పిమ్మట, ముఖ్య అతిధి తో పాటు ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ష లోమ్, డీసీపీ,జడ్పీ సీఈఓ మాధురి షా, ఆర్డివో అమర వీరుల స్తూపనికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య జిల్లా లోని వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి గురించి సందేశం ద్వారా వివరించారు. వేడుకల అనంతరం..

ఈరోజు నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్చోత్సవ్ పక్షోత్సవాలను పురస్కరించుకొని.. స్వచ్ఛతా హి  సేవ 2025 లో భాగంగా, కలెక్టరెట్ లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే, ఆలేరు బీర్ల అయిలయ్య, ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ష లోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ సెల్ఫీ ఫోటో లు దిగి... స్వచ్ఛతాయే మన నినాదం... ఆరోగ్యమే అన్నింటి కన్నా ప్రధానమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో  మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివ రాజ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు వారి సిబ్బంది పాల్గొన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ..

హనుమకొండ సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను హనుమకొండ జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ అదాలత్ కూడలి లో తెలంగాణ అమరవీరులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు అమరవీరుల స్థూపం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అమరవీరుల స్థూపం వద్ద నుండి హనుమకొండ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా పాలన వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ అమరవీరులు, ప్రజా పాలన, జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రసంగించారు. కాగా అంతకుముందు కలెక్టరేట్ కు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పుష్ప గుచ్ఛం అందించగా కలెక్టరేట్ వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి,  కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండీ. అజీజ్ ఖాన్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఎన్‌ఐటీ వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఘన స్వాగతం

వరంగల్ ఎన్‌ఐటీ కి చేరుకున్న రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పుష్ప గుచ్చాలు, మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు.

ఒకే చోట రెండు జాతీయ పతాకాల ఆవిష్కరణ!

మహబూబాబాద్, విజయక్రాంతి: ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోట గుట్ట తండా ప్రభుత్వ పాఠశాలలో ఒకేచోట అది పక్కపక్కనే రెండు జాతీయ పతాకాలను ఆవిష్కరించడం విచిత్రంగా మారిం ది.

బోడ గుట్ట తండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు గనె యాదగిరి ఒక జాతీయ పతాకాన్ని ఆవిష్క రించగా, మరో జాతీయ పతాకాన్ని పీక్లా తండా పంచాయతీ కార్యదర్శి నివాస్ ఆవిష్కరించారు. పీక్ల తండా పంచాయితీకి సొంత భవనం లేకపోవడంతో పాఠశాలలోనే ఒక గదిని కేటాయించారు. దీనితో ఒకేచోట రెండు జాతీయ పతాకాలను ఆవిష్కరించాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది.