14-01-2026 01:43:15 AM
నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి తెరకెక్కిస్తున్న మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోగా నవీన్ మాట్లాడుతూ.. “మన తెలుగువారికి సంక్రాంతి ప్రత్యేకం. ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి మన వాళ్లను కలుసుకొని సంతోషంగా ఉంటాం. అలాంటి ఎన ర్జీనే ‘అనగనగా ఒక రాజు’లో చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా సినిమా ఉంటుంది. ప్రేక్షకులు ఈ సినిమాపై చూపుతున్న ఆసక్తికి తగ్గట్టుగానే.. వారిని అలరించేలా ఉంటుందీ చిత్రం” అన్నా రు.
‘అందరూ ఈ సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తార’ని మీనాక్షి చౌదరి తెలిపింది. దర్శకుడు మారి మాట్లాడుతూ.. “సంక్రాంతి తెలుగు ప్రజలకు ప్రత్యేక పండుగ.. ఒక ఎమోషన్ కూడా. సంక్రాంతి కానుకగా మా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. రాజు గారితో ఈ పండగను ఎంజాయ్ చేయండి” అని చెప్పారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ఈ సినిమా రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంటుంది. చివరిలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా ఇది” అన్నారు. ‘ఈ సినిమాలో చాలా మంచి పాత్ర పోషించాను. ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో కూడా ఉంటాను. సినిమా చూసి మీరందరూ చాలా చాలా నవ్వుకుంటార’ని బాల నటుడు రేవంత్ అలియాస్ బుల్లి రాజు అన్నాడు.