calender_icon.png 14 January, 2026 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పేరు నిలబెట్టుకున్నానని అనుకుంటున్నా

14-01-2026 01:41:02 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఇందులో నయనతార కథానాయిక కాగా, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘మెగా బ్లాక్‌బస్టర్ థాంక్యూ మీట్’ పేరుతో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో చాలా ఫాస్ట్‌గా ఫినిష్ చేసిన స్క్రిప్ట్ ఇది. 25 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశా. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి.

ఆయన కొన్ని దశాబ్దాలుగా ఎలా అలరించారో అవన్నీ కలుపుకుంటూ వెళ్లా. అందుకే స్క్రిప్టు అంత ఫాస్ట్‌గా ఫినిష్ అయ్యింది.  ఇందులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్‌పిరేషన్ చిరంజీవే. అందుకే ఈ క్రెడిట్ మొత్తం చిరంజీవికి ఇస్తా. చిరంజీవి ఈ సినిమాలో అడుగడుగునా ఒక మ్యాజిక్‌ని క్రియేట్ చేసే అవకాశం నాకు కల్పించారు. అభిమానులు చూపిస్తున్న ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాఅభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. కొంతమంది మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్లి ముద్దు పెట్టాలని కూడా చూశారు (నవ్వుతూ). మా అందరితో కలిసిపోయి ఒక సాధారణ మనిషిలాగా అందరికీ ఫ్రీడమ్ ఇస్తూ ఆయన అనుభవాన్ని మాతో పంచుకుంటూ మా అందరినీ నడిపించిన శంకరుడు చిరంజీవి. సోషల్ మీడియాలో యూట్యూబ్‌లో 15 రోజులుగా జరిగిన విధ్వంసం మామూలుది కాదు. దొరుకుతాడా దొరకడా (నవ్వుతూ). ప్రేక్షకులకు గట్టిగా దొరికేశాను.

టికెట్ పెట్టి చిరంజీవిని మేము ఇలా చూడాలి.. ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చూస్తున్న ప్రేక్షకులందరికీ గట్టిగా దొరికాను. మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రేమ గొప్ప ఆనందాన్నిస్తోంది” అన్నారు. నిర్మాత సాహు మాట్లాడుతూ.. “మెగాస్టార్‌తో సినిమా చేస్తున్నాం అన్నప్పుడు నేను నమ్మలేకపోయా. ఎందుకంటే అది ఎవరికైనా ఒక బిగ్ డ్రీమ్. ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ బాస్ ఆఫీస్ అవుతుందని రెండు నెలల క్రితమే అనిల్‌తో నేను చెప్పాను. ప్రేక్షకులు సినిమాని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు” అని చెప్పారు. నిర్మాత సుస్మిత మాట్లాడుతూ.. “ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మ రథం పట్టారు. సినిమా లాంచింగ్ సమయంలో నాన్న నా పేరు అడిగితే సుస్మిత కొణిదెల అని చెప్పా. ఆ పేరు నిలబెట్టుకో అన్నారు. ఆ పేరు నిలబెట్టుకున్నానని అనుకుంటున్నా” అన్నారు.

సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ.. “నేను వచ్చి పాతికేళ్లు. ఇది నాకు ఒక సిల్వర్ జూబ్లీ. ఈ సిల్వర్ జూబ్లీలో మెగాస్టార్ చిరంజీవితో ఒక బ్లాక్‌బస్టర్ సినిమా చేసి నిలబడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరూ నా పాటల మీద చూపించిన ఇష్టానికి రుణపడి ఉంటాను” అన్నారు. ఇంకా ఈ వేడుకలో నటులు హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శ్రీనివాస్‌రెడ్డి, సాయి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయికృష్ణ, రైటర్ అజ్జు మహంకాళి రెడ్డి, ఫైట్ మాస్టర్ వెంకట్, ఆర్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, డీవోపీ సమీర్‌రెడ్డి, లిరిక్స్ రైటర్స్ కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి, సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు.