పీఆర్ టీమ్స్ తీరు మారాలి!
‘గత రెండేళ్లలో బాలీవుడ్‌లో పీఆర్ వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ప్రమోషన్ అనేది కేవలం తమ సినిమా గురించి మాట్లాడటానికే పరిమితం కావడంలేదు. ఇతరులను తక్కువగా చూపించే స్థాయికి వెళ్లింది’ అంటోంది బాలీవుడ్ నటి తాప్సీ పన్ను. హిందీ చిత్ర పరిశ్రమలో ఇటీవల పెరుగుతున్న పబ్లిసిటీ సంస్కృతిపై తాప్సీ తన అభిప్రాయాన్ని ఇలా బహిరంగంగా వెల్లడించింది. “ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని పీఆర్ టీమ్స్ తమ సినిమాలకు హైప్ క్రియేట్ చేయడానికి ఇతర నటులు, సినిమాలపై నెగటివ్ కథనాలు సృష్టిస్తున్నాయి. ఇది పోటీ ఏమాత్రం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా తప్పుదారి పట్టిన విధానమే.
సినిమా కంటెంట్, నటన, కథ బలం గురించి మాట్లాడాల్సిన చోట వ్యక్తిగత విమర్శలు, ఇతరులపై నిందలు వేయడం ట్రెండ్‌గా మార్చారు. ఇలాంటి పీఆర్ గేమ్స్‌లో నేనెప్పుడూ భాగం కాలేదు. నేను అలాంటి వ్యూహాలకు దూరంగా ఉండటం పట్ల చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నా. ఇతరులను కిందకు లాగి, పైకి ఎదగడం నాకు ఇష్టం లేదు” అని పేర్కొంది తాప్సీ. తాప్సీ వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్‌లోనూ ప్రస్తుత పీఆర్ వ్యవస్థపై ఆసక్తికర చర్చకు తెర తీశాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక పీఆర్ టీమ్ ఫిక్స్ చేసిన టైమ్‌లోనే మరో టీమ్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్న సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. దీంతో మీడియా ఇబ్బందుల పాలవుతున్నారు. ఎదుటివాళ్ల స్థాయిని తగ్గించేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారనే విమర్శలు న్నాయి. తాప్సీ మాటలు ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన పోటీ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




