ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్
- ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్
చండూరు, మార్చి 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-2027 బడ్జెట్ ప్రజా, ఉద్యోగ, కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్ అని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ అన్నారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్లో 12 వేల కోట్లు పెట్టి బీసీల గొంతు కోశారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి బీసీలను మోసం చేశారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. 6 గ్యారంటీలు 11 డిక్లరేషన్లు అన్ని మోసమేనని భారతదేశ చరిత్రలో ప్రజలను ఇంత దగాపూరితంగా మోసం చేసిన బడ్జెట్ నేను చూడలేదన్నారు. ఎస్సీ, ఎస్టి, బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వకపోవడం ద్వారా ఆయా వర్గాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
అలాగే గురుకుల పాఠశాలల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సరిపడ నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక లోకానికి ఉపయోగపడే విధంగా లేదని, కార్మికుల సంక్షేమం, వేతనాల పెంపు, కర్షకుల మద్దతు వంటి అంశాల్లో స్పష్టమైన కేటాయింపులు లేవని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని, ఉన్నత విద్య పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. స్వయం ఉపాధి కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిధుల కొరత సాకుతో లబ్ధిదారులకు సహాయం అందించకపోవడం దారుణమన్నారు.
చండూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, బీ ఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మర బోయిన వెంకన్న, బీ ఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షులు పెద్దగోని వెంకన్న,బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కొండ్రెడ్డి మధు, సామ యాదవ రెడ్డి, బీ ఆర్‌ఎస్ మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్,బీఆర్‌ఎస్ నాయకులు చొప్పరి దశరథ వివిధ గ్రామాలబీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.




