10 July, 2026 | 5:36 AM

నరసింహం చేసే సవారి ఇదేగా..

15-12-2024 12:00 AM

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘ది రేజ్ ఆఫ్ డాకు’ లిరికల్ వీడియోను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ తరహా పాట బాలకృష్ణ నటించిన ఏ చిత్రంలోనూ లేదనే చెప్పాలి. ‘డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా’ అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం, తమన్ సంగీతం ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘డాకు మహారాజ్’ పాత్ర తీరుని తెలియజేసేలా ఈ గీతం ఉంది. భరత్ రాజ్, నకాష్, అజీజ్, రితేష్ జి రావ్, ప్రణతి ఈ పాటను ఆలపించారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనులపై దృష్టి సారించింది. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.