20-01-2026 12:48:42 AM
12 ఏళ్లలో పదుల సమావేశాలు, డజన్ల కొద్దీ లేఖలు.. అయినా కదలని కేంద్రం
అర్హత లేని ప్రాంతాలకు వరాలు.. అన్ని అర్హతలున్న సిరిసిల్లకు మొండిచేయా?
తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు, మంత్రులున్నా దక్కని మెగా క్లస్టర్
రాష్ర్టం నుంచి గెలిచి కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారు
పదేళ్ల బీఅర్‌ఎస్ ప్రభుత్వంలోనే మెగా క్లస్టర్ కోసం అన్ని ఏర్పాట్లు
ఈ కేంద్ర బడ్జెట్‌లోనైనా మెగా క్లస్టర్ ప్రకటన చేయాలి
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ నేతన్నలపై కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్షాపూరిత వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు ఘాటుగా లేఖ రాశారు.
సిరిసిల్లలో ‘మెగా పవర్ లూమ్ క్లస్టర్ణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, గత పదేళ్లుగా దీనిపై తాము నిరంతరాయంగా పోరాడుతున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, సిరిసిల్లా శాసన సభ్యుడిగా పూర్వపు టెక్స్ టైల్ శాఖ మంత్రులకు రాసిన అనేక లేఖలు, అనేక వ్యక్తిగత సమావేశాలు, అధికారిక విజ్ఞప్తులు ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయానికి నోచుకోకపోవడం అన్యాయమన్నారు.
సిరిసిల్ల క్లస్టర్ ఏర్పాటు కోసం గత పదేళ్లలో సుమారు పది సార్లు కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి నివేదికలు, వినతులు ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ మొదలుకొని నేటి మంత్రి వరకు ప్రతి ఒక్కరినీ బతిమిలాడామని, సీపీసీడీఎస్ నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర బృందాలే ధ్రువీకరించినా, ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటి? తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత కక్ష? అని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, తెలంగాణ అభివద్ధిని, ముఖ్యంగా ఇక్కడి నేతన్నల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
అన్ని అర్హతలున్నా పక్కనబెట్టడం సిగ్గుచేటు
సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయ అని కేటీఆర్ పేర్కొన్నారు. అక్కడ 30 వేలకు పైగా పవర్ లూమ్స్ కలిగి ఉండి, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. “సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం, అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అన్నారు. సిరిసిల్లకు మెగా క్లస్టర్ రాకపోవడానికి కారణం మెరిట్ లేకపోవడం కాదు, కేంద్రానికి తెలంగాణపై ఉన్న కక్షే అని విమర్శించారు.
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, నిరంతర విద్యుత్, నీరు, సింగిల్ విండో అనుమతులు, రాష్ర్టస్థాయి ప్రోత్సాహకాలు.. ఇలా ప్రతి ఒక్క అర్హతను పూర్తి చేసిందని కేటీఆర్ వివరించారు. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయని పదేపదే చెబుతున్నా, ఎటువంటి సాంకేతిక లేదా ఆర్థిక కారణాలు చూపకుండా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటు అని ఎండగట్టారు.
నినాదాలకే పరిమితమైన బీజేపీ
ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ అని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం, దేశంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన సిరిసిల్ల వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రానికి మద్దతు ఇవ్వకపోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద నీతికి, చిత్తశుద్దిలేమికి అద్దం పడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం నినాదాలకే పరిమితం అయిందన్నారు. కేంద్రం చేస్తున్న ఈ జాప్యం వల్ల మీ పార్టీకి సిరిసిల్లా నేతన్నలు భారీ మూల్యం చెల్లిస్తారన్నారు.
రాష్ర్టంలో కాంగ్రెస్ పాలన వచ్చిన నాటి నుంచి చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, మళ్లీ ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచిందని, కానీ నేడు పరిస్థితులు మారుతున్నాయని వెల్లడించారు. ఇటువంటి కీలక సమయంలో కేంద్రం జోక్యం చేసుకుని మెగా క్లస్టర్‌ను మంజూరు చేయాల్సి ఉండగా, తీవ్రమైన జాప్యం చేయడం నేతన్నల పొట్ట కొట్టడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల వైఫల్యం
సమాఖ్య ప్రజాస్వామ్యంలో అభివద్ధి అనేది రాజకీయ ప్రయోజనాల అధారంగానో లేక తాము అధికారంలో ఉన్న ఎంపిక చేసిన రాష్ట్రాలకే పరిమితం కాకూడదన్నారు. కేవలం తాము రాష్ర్టంలో అధికారంలో లేమనే కారణంతో తెలంగాణను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నా, కేంద్ర మంత్రివర్గంలో చోటు ఉన్నా.. సిరిసిల్ల నేతన్నల గోడును వినిపించడంలో వారు విఫలమయ్యారని కేటీఆర్ ఆరోపించారు.
రాష్ర్టం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారన్నారు. బీజేపీ నాయకులు కేవలం ఓట్ల కోసమే తెలంగాణను వాడుకుంటున్నారు తప్ప, నిధుల సాధనలో చేతులెత్తేశారని కేటీఆర్ విమర్శించారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనైనా సిరిసిల్ల ‘మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను అధికారికంగా ప్రకటించి, ఈ పదేళ్ల అన్యాయానికి ముగింపు పలకాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తితో తెలంగాణ నేతన్నల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మీరు సానుకూల నిర్ణయం తీసుకోవాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం జాప్యం పెరిగే కొద్దీ నేతన్నలలో ఆవేదన ఆగ్రహంగా మారుతుందని, తక్షణమే కేంద్రమంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కోరారు.