20-01-2026 12:49:09 AM
కామారెడ్డి అర్బన్, జనవరి 19 (విజయక్రాంతి): డబ్బులు, బంగారం ఇవ్వడం లేదని మద్యం మత్తులో తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన కంచర్ల గౌరవ్వ వద్ద ఉన్న డబ్బు, మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు తీసుకోవడానికి కొడుకు రాజేష్ ప్రయత్నించగా గౌరవ్వ నిరాకరించింది. దాంతో మద్యం మత్తులో ఉన్న రాజేష్ తన చేతికి ఉన్న కడియంతో గౌరవ్వపై దాడి చేయగా తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయింది.
పోలీసులకు సమాచారం రావడంతో గౌరవ్వ పరిస్థితి గమనించిన పోలీసులు పెట్రోకార్‌లో జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం తల్లి వద్ద నుంచి తీసుకున్న బంగారు గొలుసును జేపీఎన్ రోడ్డులో అమ్మడానికి ప్రయత్నించిన రాజేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి బంగారు గొలుసు, కడియం, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గౌరవ్వకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందన్నారు. తల్లిదండ్రుల బాధ్యత కొడుకులపై ఉంటుందని, వారిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చట్టాలు ఉన్నాయని ఏఎస్పీ గుర్తు చేశారు.