12 June, 2026 | 1:24 AM

ట్రెండ్ క్రియేటర్ తీన్మార్ మల్లన్న

12-06-2026 12:00 AM

తెలంగాణ రాజకీయ, సామాజిక రంగాల్లో ఒక స్వతంత్ర జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వేర్వేరు సమయాల్లో వేర్వేరు రాజకీయ వ్యూహాలను అనుసరరించి, తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)  ఒక ‘ట్రెండ్ క్రియేటర్’గా గుర్తింపు పొందా రు. ఆయన ప్రాంతీయ భాషలో అగ్రెసివ్‌గా రాజకీయ వ్యాఖ్యానం చేస్తూ బాగా పాపులర్ అయ్యారు.

ఒకప్పుడు రాజకీయాల్లో లేదా ప్రజా సమస్యల మీద ప్రభావం చూపించాలంటే పెద్ద టీవీ ఛానళ్లు, దినపత్రికలు ఉండాలనే అభిప్రాయం ఉండేది. కానీ, తీన్మార్ మల్లన్న ప్రధాన స్రవంతి  మీడియాతో సమానంగా డిజిటల్ మీడియాకు పవర్ ఉందని నిరూపించారు. అయితే, మల్లన్న చూపిన మార్గంలో పయనిస్తూ కొందరు ఆయనపైనే బురదజల్లుతుండటం శోచనీయం.

రాజకీయ అధికారం అనేది కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. మల్లన్న తన పార్టీ స్లోగన్ అయిన ‘ఆత్మగౌరవం అధికారం  భాగస్వామ్యం’ ద్వారా విమర్శలకే పరిమితం కాకుండా, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారంలో నేరుగా వాటా దక్కాలనే అజెండాను క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు.

ఇది బహుజన సమాజంలో ఒక కొత్త రాజకీయ చైతన్యాన్ని రగిల్చింది. మల్లన్న నేరుగా అధికార పీఠాన్ని సవాల్ చేయడం చూసి చాలామందిలో ధైర్యం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ‘ఒక బలమైన విపక్షం లేదా ఒక బలమైన ప్రశ్నించే గొంతుక’ వ్యవస్థలో ఎలాంటి మార్పు తెస్తుందో చెప్పడానికి ఇది ఉత్తమ ఉదాహరణ.

తీన్మార్ మల్లన్న నేరుగా అధికారంలోకి వచ్చారా లేదా అన్నది పక్కన పెడితే... ఆయన సృష్టించిన రాజకీయ ప్రకంపనల వల్ల, సాంప్రదాయ పార్టీలు సైతం బీసీలకు ‘విలువ’ ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించారు. ఆ రకంగా చూస్తే, పెద్ద పార్టీల్లో ఉన్న బీసీ నేతల రాజకీయ ఎదుగుదలకు మల్లన్న ఒక ‘ఉత్ప్రేరకం’ లా పనిచేశారనేది అక్షర సత్యం. ఆయన ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ ఒక రాజకీయ ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, దశాబ్దాలుగా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్న ఒక సరికొత్త తరానికి వేదికగా మారింది.

ఈ నిర్ణయం ద్వారా ఆయన బహుజన రాజకీయాల్లో ఒక పెద్ద సానుకూల మార్పుకు కారణమయ్యారు. ఈ క్రమంలో బీసీ ఎజెండా వైపునకు బహుజన ఓటర్లు ఆకర్షితులైతే, తమ మనుగడ కష్టమవుతుందని రాజకీయ పార్టీల అధినేతలకు స్పష్టమైంది. దీనివల్ల పెద్ద పార్టీల్లో ఉన్న బీసీ నాయకులకు అకస్మాత్తుగా గౌరవం పెరిగిందని చెప్పవచ్చు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ‘డిజిటల్ జర్నలిజం’ అనే ఒక కొత్త రంగాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి, దాన్ని ఒక ఉపాధి మార్గంగా మార్చడంలో తీన్మార్ మల్లన్న చూపిన ప్రభావం చాలా పెద్దది. ఆ రకంగా ఆయన ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు.

వ్యాసకర్త సెల్: 9177566741

డా. పర్వతం వెంకటేశ్వర్