నాకున్న ఆ పేరును మార్చేసే సినిమా ఇది
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటిస్తున్న తాజా థ్రిల్లర్ ‘కానిస్టేబుల్’. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆర్యన్ సుభాన్ దర్శకత్వం లో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కంటెంట్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది’ అన్నారు. అతిథులుగా విచ్చేసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి మాట్లాడుతూ.. కంటెంట్ ఉన్న సినిమాలకు నేడు అధిక ప్రాధాన్య ఉందన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇప్పటివరకు లవర్‌బాయ్‌గా పేరు ఉంది. ఈ సినిమా తప్పకుండా మా అంచనాలను నిలబెదుతుందని ఆశిస్తున్నా’ అన్నారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. ‘మా అందరి కేరీర్‌ను మలుపుతిప్పే చిత్రమవుతుంది. బాధ్యతలను గుర్తు చేస్తూ హృదయాలను హత్తుకునే సినిమా ఇది’ అని చెప్పారు. చిత్ర నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. ‘కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా చేశాం’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ మధులిక వారణాసి, వరుణ్ సందేశ్ సతీమణి వితిక, కెమెరామెన్ హజరత్ వలి, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, గాయకుడు గద్దర్ నర్సన్న పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ముగ్గురు రియల్ పోలీసు కానిస్టేబుల్స్‌ను సత్కరించారు.






