5 June, 2026 | 1:12 AM

జస్ట్ ఆస్కింగ్.. పొత్తుతోనా, సింగిల్‌గానా?

05-06-2026 12:00 AM

వర్తమాన రాజకీయాలకు చిత్రపరిశ్రమ వేదికగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నటుడు, జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలం గాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు ప్రకాశ్‌రాజ్ పరో క్షంగా స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఎక్స్ లో ట్విట్ వేయగా, దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ ప్రతిస్పందిస్తూ ట్విట్ వేశారు.

ప్రకాశ్‌రాజ్ తీరును విమర్శిస్తూ బం డ్ల గణేశ్ ఘాటుగా స్పందించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ‘మీరొస్తానంటె మేమొద్దం టామా? రండి దొర. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్‌గా వస్తున్నా రా? అది చెప్పి రండి” అంటూ ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వేశారు. 

దీనిపై బండ్ల గణేశ్ రిప్లై ఇస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా.. లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి  పనిలేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు.

ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో.. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్‌” అని రాసుకొచ్చారు బండ్ల గణేశ్. ప్రకాశ్‌రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పలు సందర్భాల్లో స్పందించడాన్ని ఉద్దేశిస్తూ బండ్ల గణేశ్ ఇంకా ఇలా రాసుకొచ్చారు.. “ప్రకాశ్‌రాజ్ నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీకు నువ్వే గొప్ప మేధావిని, గొప్ప వీరుడిని అని సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికెట్.

నీ సొంత రాష్ట్రంలో, నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు, రాష్ట్ర, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రతి విషయానికీ ‘జస్ట్ ఆస్కింగ్’ అని చెప్పడం చాలా సులువు. కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నువ్వు సాధించినది ఏంటి? సమాజం కోసం నువ్వు చేసినది ఏంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి? అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో.

ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు, వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. విమర్శలు కాదు, విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది. ఎత్తయిన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయీ పెరగదు” అని పేర్కొన్నారు.