calender_icon.png 12 October, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పంటలను పీఎస్‌ఎస్‌లో చేర్చాలి

12-10-2025 03:58:08 AM

 కేంద్ర మంతి చౌహాన్‌కు రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : మొక్కజొన్న, జొన్న పంటలను ప్రైస్ సపోర్ట్ (పీఎస్‌ఎస్) స్కీమ్‌లో చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు  శనివారం లేఖ రాశారు. రాష్ర్టంలో అమలవుతున్న మద్దతు ధర పథకం (పీఎస్‌ఎస్)లో ఉన్న పరిమితులు, ప్రధాన పంటల కొనుగోలుపై కేంద్ర నిర్లక్ష్యం, రైతుల ఆదాయం, కేంద్ర వాణిజ్య విధానాలపై ప్రభావం చూపుతోందని మంత్రి తుమ్మల ఆ లేఖలో పేర్కొన్నారు.

కనీస మద్దతు ధర పథకం కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, శనగలు, వేరుశనగ, సో యాబీన్, పెసళ్ళు వంటి పంటలపై సీలింగ్ విధించడంతో రైతులు తాము పండించిన పంటలో కేవలం 25 శాతం మాత్రమే మద్దతు ధరకు అమ్ముకొనే వెసులుబాటు ఉంటుంది. మార్కెట్‌లో ధరలు పడిపోయిన సమయంలో రైతుల ప్రయోజనార్థం రాష్ర్ట ప్రభుత్వం మార్క్ ఫెడ్ , సహకార సంస్థల ద్వారా కేంద్రం విధించిన 25 శాతం సీలింగ్ కంటే ఎక్కువ కొనుగోళ్లు చేయవలసి వస్తోంది. దీంతో రాష్ర్టంపై ఆర్థిక భారం పడుతోందన్నారు.  పీఎస్‌ఎస్ కింద ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితిని రద్దు చేయాలి..

లేకుంటే సడలించాలి. కేంద్ర ఆర్థిక మద్దతు లేకుండా ఇది దీర్ఘకాలంగా కొనసాగడం అసాధ్యం. ఎంఎస్పీ అమలు, మార్కెట్ జోక్యాల్లో కేంద్ర- రాష్ట్రాల మధ్య వ్యయభారం పంచుకునే ఆర్థిక విధానం రూపుదిద్దాలి ’ అని మంత్రి తుమ్మల కోరారు. అలాగే కేంద్రం క్రూడ్ పామ్ ఆయిల్స్ కస్టమ్స్ సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించడంతో దేశీయ ధరలు తీవ్రంగా పడిపోయి, ఆయిల్ పామ్ రైతులు పొందే ధర టన్నుకి రూ 20 వేల కంటే తక్కువకు చేరిందన్నారు.  పత్తి విషయంలో సీసీఐ కొనుగోళ్లు 50 నుంచి 60 శాతం వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయని, నాణ్యత పరమైన కారణాలు, కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.