calender_icon.png 24 February, 2026 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

24-02-2026 01:25:12 AM

హుజూరాబాద్, ఫిబ్రవరి23 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అమానుషంగా దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారణమైన అగ్రకుల అహంకారులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొలీపక సారయ్యలు  డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లాహుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రజక మహిళలతో కలిసి వారు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

అమానుష దాడిని ఖండిస్తూ..

ఈ సందర్భంగా సాయికృష్ణ, సారయ్యలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకోవడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయమని మండిపడ్డారు. కులం పేరుతో దూషిస్తూ, ఆలయంలోకి ప్రవేశం లేకుండా అడ్డుకోవడమే కాకుండా, ఎదురు తిరిగినందుకు కుటుంబ సభ్యులపై విచక్షణా రహి తంగా దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ దాడిలోనే రెండు నెలల పసికందు మరణించడం అత్యంత విషాదకర మని, దీనికి బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం

బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడానికి వెళ్తే, కనీసం కేసు నమోదు చేయకుండా వారిని వేధించిన పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, నిందితులకు కొమ్ముకాసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు నిందితులు జైలుకు వెళ్లే వరకు రజక సమాజం పోరాటాన్ని ఆపదని వారు హెచ్చరించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా యావత్తు రజక లోకం ఏకమై బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు నల్ల బాలరాజ్, బోరింగ్ వెంకట్రాజ్యం, కొలిపాక బిజెపిశ్రీనివాస్, కొలిపాక రమేష్, గోపు వెంకటేశ్వర్లు. కొలీపాక శ్రీనివాస్, కొండపాక పవన్, నల్ల సుమన్, సుంకరి మొగిలి, కొండపాక లక్ష్మి, నిమ్మటూరి రమ, వసంత, భూలక్ష్మి, స్వరూప, కొలిపాక రంగయ్య, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, తులసి లక్ష్మణమూర్తి, చిలకమర్రి శ్రీనివాస్, సాదుల రవీందర్, ఇప్పకాయల సాగర్ తో పాటు  తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.