6 May, 2026 | 1:53 AM

ముగిసిన లెఫ్ట్ శకం!

06-05-2026 12:00 AM

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల పాలనా శకం ముగిసింది! లెఫ్ట్ పార్టీల చివరి కంచుకోట కేరళంలో కూడా బద్ధలైపోవడంతో గత ఐదు దశాబ్దాల్లో తొలిసారిగా మన దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం లేని పరిస్థితి ఏర్పడింది. చివరిసారిగా 1977 సమయంలో లెఫ్ట్ పార్టీల పాలన లేకపోవడాన్ని దేశ ప్రజలు చూశారు. కేరళంలో సీపీఎం నేతృత్వంలోని ఏకైక వామపక్ష ప్రభుత్వం (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) కుప్పకూలిన సంగతి తెలిసిందే.

కాగా, దేశవ్యాప్తంగా ఇప్పుడు వెలవెలబోతున్న ఎర్రజెండా గతం లో అనేక ప్రాంతాల్లో రెపరెపలాడి అభాగ్యులకు ఆసరాగా నిలిచింది. 1977 నుంచి 2011 వరకు సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌ను ఏలింది. దేశంలోని ఒక రాష్ట్రాన్ని 34 ఏళ్ల సుదీర్ఘకాలం పాలించిన ఘనత కూడా సీపీఎం పార్టీదే కావడం విశేషం. మరోవైపు ఈశాన్య రాష్ట్రం త్రిపురలోనూ 1993 నుంచి 2018 వరకు లెఫ్ట్ ఫ్రంట్ హవా నడిచింది.

ఈ రాష్ట్రాల తర్వాత కేరళం కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా అవ తరించింది. అయితే, కాలక్రమంలో ఈ రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కమ్యూనిస్టు పార్టీలు కోల్పోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో, కేరళంలో ఎల్డీఎఫ్ కూటమి అధికారం కోల్పోయినప్పటికీ, 35 స్థానాలతో ఇప్పటికీ బలమైన ప్రతిపక్షంగా ఉండటం ఒక్కటే ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు ఊరట అని చెప్పాలి. దేశంలో లెఫ్ట్ పార్టీల పాలన కనుమరుగు కావడానికి అనేక కారణాలున్నాయని చెప్పక తప్పదు.

కాలంతో పాటే మారకుండా, పాత సిద్ధాంతాలను పట్టుకొని వేలాడి పశ్చిమ బెంగాల్, త్రిపురలలో వామపక్షాలు తమ అస్తిత్వాన్ని కోల్పోగా, కేరళంలో మాత్రం అందుకు విరుద్ధంగా అవినీతి ఆరోప ణలు, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా పాలనాపగ్గాలు వదులుకోవాల్సి వచ్చింది. కేరళం విషయాన్ని పక్కనపెడితే, దేశవ్యాప్తంగా వామపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాయి.

వామపక్ష పార్టీల మధ్య ఐక్యత లోపించడం, విప్లవాలకు, పోరాటాలకు మారుపేరైన కమ్యూనిస్టులు ఉద్యమాలను వదిలేయడం, తత్ఫలితంగా సామాన్యులు, ముఖ్యంగా శ్రామికులతో సంబంధాలు తెగిపోవడం తదితర కారణాలు ఈ పరిస్థితికి దారితీశాయని చెప్పేందుకు ఎలాంటి సంశయం అక్కర్లేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష భావజాలం పట్ల సామాన్య ప్రజలతోపాటు జెన్ జీ యువత పెద్దగా ఆకర్షితులు కాకపోవడమూ లెఫ్ట్ పార్టీలకు పెనుశాపంగా మారింది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి కమ్యూనిస్టు పార్టీలు ఎలా ముందుకెళ్తాయో చూడాలి.