calender_icon.png 14 November, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు పువ్వులు.. ఆరు కాయలు

29-07-2024 02:03:53 AM

  1. పన్నులే లేని కోచింగ్ సెంటర్ల దందా
  2. దేశవ్యాప్తంగా వేల కోట్ల వ్యాపారం
  3. కోటా నుంచి ఢిల్లీదాక ఇదే తీరు
  4. విద్యార్థుల నుంచి లక్షల్లో వసూళ్లు
  5. సౌకర్యాలు మాత్రం సందుగొందులే

న్యూఢిల్లీ, జూలై 28: గోడపై అందమై బోర్డు ఉంటుంది. మీరు మా సెంటర్‌లో కోచింగ్ తీసుకొంటే ఐఏఎస్ ఐపోయినట్టే అని గ్యారెంటీ ఇస్తున్నట్టుగా ప్రకటనలు ఉం టాయి. లోపలికి వెళ్తే కనీసం కూర్చోవటానికి సరైన కుర్చీలు కూడా ఉండవు. ఇదేంటేంటే చదువుకోవటానికి వచ్చారా? నిద్రపోతారా? అనే వెటకారపు మాటలు కూడా వినిపిస్తాయి. ఢిల్లీలో రావ్స్ ఐఏఎస్ కోచింగ్‌సెంటర్ భవనంలోకి నీళ్లు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోవటంతో కోచింగ్ సెంటర్ల దందా మరోసారి చర్చలోకి వచ్చింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కోచింగ్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా చెలామనీ అవుతున్నది. 

పన్నులు కూడా లేవు

దేశంలో సివిల్స్‌లోపాటు వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షలు, నీట్, జేఈఈ, క్యాట్ తదితర అనేక పరీక్షల కోసం ఏటా కొన్ని కోట్ల మంది విద్యార్థులు కోచింగ్ తీసుకొంటున్నారు. అసలు కోచింగ్ తీసుకోకుండా ఉద్యోగమే రాదు అన్నట్టుగా పరిస్థితిని సృష్టించారు. కోచింగ్ సెంటర్ల బలం ఎంత స్థాయికి చేరిందంటే.. బిజినెస్‌ను పెంచుకొనేందుకు పరీక్షలనే వాయిదా వేయించగల రు. అయితే, దాదాపు 90 శాతం కోచింగ్ సెం టర్లలో ఎలాంటి అధికారిక లెక్కలూ ఉండవు. ఎంతమంది చేరారు. ఒక్కో విద్యార్థి నుంచి ఎంత ఫీజు వసూలు చేశారు.

అనే లెక్కాపత్రం ఏమీ ఉండదు. దీంతో పన్నులు కట్టే శ్రమా ఉండదు. కానీ, పరీక్షను బట్టి ఒక్కో విద్యార్థి నుంచి వేల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటారు. ఏటా ఒక్కో కోచింగ్ సెంటర్ కోట్ల రూపాయలు ఆర్జిస్తుంటుంది. ఆ సంపాదనపై ఎవరికీ లెక్కలు చెప్పేది ఉండదు. రాష్ట్రాల పరిధిలో జరిగే పరీక్షలు సీజనల్‌గా ఉంటాయి. వీటికి కోచింగ్ ఇచ్చే సెంటర్లకు ఏడాదంతా ఆదాయం ఉండదు. కానీ, సివిల్స్, నీట్, జేఈఈ కోచింగ్‌లు వన్నె తరగనివి. అందుకే ప్రధాన నగరాల్లో ప్రతి సందులోనూ ఏదో ఒక కోచింగ్ సెంటర్ బోర్డు  కనిపిస్తుంది. హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లతో కోట్లు గడించిన కొందరు రాజకీయ నేతల అవతారం కూడా ఎత్తారు. 

సౌకర్యాలు నిల్

కోచింగ్ సెంటర్లలో ఒకే సమయంలో వం దలమందితో బ్యాచ్‌లు నిర్వహిస్తుంటారు. కానీ, అందులో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. చిన్నచిన్న సందుల్లో, ఒక్కరు మాత్ర మే వెళ్లగలిగే మెట్లు ఉన్న భవనాల్లో కూడా కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. ఇంతమంది గుమికూడే చోట ఏదైనా ప్రమాదం జరిగితే దాని తీవ్ర ఊహకు కూడా అందదు. కానీ, సెంటర్ల యజమానులకు ఇవేవీ పట్టవు. చాలా సెంటర్లలో తాగటానికి నీళ్లు కూడా సరిపడా ఉండటంలేదు. ఇక అగ్నిమాపక వ్యవస్థలను వీటిల్లో ఊహించనేలేము. 2019లో గుజరాత్‌లోనరి సూరత్‌లో సర్తానా అనే ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్లలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 22 మంది విద్యార్థులు మరణించారు. ఇక కోచింగ్ సెంటర్లకు ప్రధాన కేంద్రమైన గుజరాత్‌లోని కోటాలో నిత్యం విద్యార్థుల మరణాల వార్తలు వింటూనే ఉన్నాం. ఈ ఏడాది అక్కడి ఓ కోచింగ్ సెంటర్ హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

ప్రభుత్వాల అలసత్వం

కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకొనేందుకు వెనుకాడుతున్నాయి. ఏదైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే విద్యార్థులను ముందుపెట్టి కోచింగ్ సెంటర్ల యజమానులు ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ రావ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ భవనంలో ఉన్న సెల్లార్‌ను పార్కింగ్ కోసం మాత్రమే కేటాయించారు. కానీ, అందులో కొన్నేండ్లుగా అక్రమంగా లైబ్రరీని నడుపుతున్నారు. దీన్ని అధికారులు ఏనాడూ ప్రశ్నించి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రెండుమూడు రోజులు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది హడావిడి చేయటం.. ఆ తర్వాత అంతా మర్చిపోవటం సర్వసాధారణంగా మారింది.