29-07-2024 01:52:09 AM
దేశంలో ఖాదీ విక్రయాలు 400 శాతం పెరిగాయి
ఖాదీ విలేజ్ టర్నోవర్ రూ.1.5 లక్షల కోట్లు దాటింది
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, జూలై 28 : దేశంలో పెరుగుతున్న చేనేత, ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. “ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ టర్నోవర్ మొదటిసారిగా రూ. 1.5 లక్షల కోట్లు దాటింది. ఖాదీ విక్రయాలు 400 శాతం పెరిగాయి. తద్వారా ఖాదీ పరిశ్రమ అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. మహిళలు ఎక్కువ ఉపాధి పొందుతున్నారు. ప్రజలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను #MyProductMyPride పేరుతో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలి” అని సూచించారు. ఈ చిన్న ప్రయత్నం చాలా మంది జీవితాలను మారుస్తుందన్నారు. చేనేత, ఖాదీ పరిశ్రమ ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుందన్నారు.
చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం..
జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) సమీపిస్తున్న తరుణంలో చేనేత పరిశ్రమకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. హర్యానా రోహ్‌తక్ జిల్లాకు చెందిన 250 మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసుకొని బెడ్ కవర్లు, చీరలు, దుపట్లు తయారు చేస్తున్నారని, తద్వారా లక్షల రూపాయల్లో సంపాదిస్తున్నారని తెలిపారు. ఈ ఖాదీ ఉత్పత్తులకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉందని గుర్తు చేశారు.
రోహ్‌తక్‌లోని మహిళల మాదిరిగానే అనేక మంది మహిళలు చేనేత పరిశ్రమకు ప్రాచుర్యం కల్పించడంలో విశేషమైన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళల కృషి వల్ల ఒడిశాలోని సంబల్‌పురీ చీరలు, మధ్యప్రదేశ్‌లోని మహేశ్వరి చీరలు, మహారాష్ట్రలోని పైథానీ, విదర్బలోని హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు, హిమాచల్‌ప్రదేశ్‌లోని బుట్టికో శాలువాలు, ఉన్ని బట్టలు, జమ్మూ కశ్మీర్‌లోని కనీ శాలువాలు ప్రసిద్ధిగాంచాయని కొనియాడారు. కళాకారులను ప్రోత్సహించేందుకు పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా (PARI) పాజెక్టును ప్రారంభించామని తెలిపారు.