25 May, 2026 | 8:50 AM

మరో మూడు రోజులు వడగాలులు

18-04-2024 03:05 AM

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : తెలంగాణలో రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ మూడు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధవారం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండలో 44.8 డిగ్రీలు, మహబూబాబాద్ 44.7 డిగ్రీలు, ములుగు, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల 44.4 డిగ్రీలు, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

భద్రాచలంలో భక్తులకు ఇబ్బందులు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో శ్రీ సీతారాముల కల్యాణానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రతను భరించలేకపోయారు.