3.59 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
అశ్వారావుపేట, మే 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జంగారెడ్డిగూడెం మార్గంలో పోలీసులు శనివారం భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం 165 ప్యాకెట్లు గంజాయి దొరికిందని, దీని విలువ రూ.89.83 లక్షలు ఉంటుదని పోలీసులు తెలిపారు. తరలిస్తున్న వాహనం, 5 సెల్‌ఫోన్లు సీజ్‌చేసి, 11మందిని అరెస్టు చేశారు. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో శనివారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక వ్యాన్‌లో పనస కాయల మధ్య గంజాయి లభించింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. మొత్తం ౩.౫౯ క్వింటాళ్ల బరువున్న ౧౬౫ ప్యాకెట్లు దొరికాయని వెల్లడించారు. నిందితులు చింతమాన్ సంతోష్‌సింగ్, రాంపూరి గోపీసింగ్, విక్రమ్‌సింగ్, శైలేంద్రసింగ్, చింతమన్ దీపిక, కోమిటి, లక్ష్మణ్ కిముడు, రాజ్య ముడ, ఆదిత్యాసింగ్, మహేందర్‌సింగ్, కట్నాక్ రమేశ్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఎస్సై తెలిపారు.






