10 August, 2026 | 6:07 PM

విపత్తు రాకుండా నిర్వహణ

26-05-2024 01:00 AM

అత్యవసర సేవలన్నీ ఒకే వ్యవస్థ కిందికి 

ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాలన్నింటికీ ఒకటే

ఎన్నికల కోడ్ ముగిశాక ఆకస్మిక తనిఖీలు 

వానకాలం నాలాల సమస్య తలెత్తవద్దు

వరద సమస్యకు శాశ్వత పరిష్కార ప్రణాళిక 

డ్రగ్స్ సరఫరా చైన్‌ను చేధించాలి

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం 

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం (హెచ్‌ఎండీఏ) పరిధిలోని అత్యవసర సర్వీసులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలన్నింటినీ ఒక యూనిట్‌గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించాలని, ఒక్కో విభాగానికి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవ స్థ ఉండాలని అధికారులకు సూచించారు.

జూన్ 4లోగా ఇందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం శనివారం సందర్శించారు. వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులను సహించబోమని హెచ్చరించారు. నాలాల్లో పూడిక తీసిన చెత్తను సమీపంలోని క్వారీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి, వాటికి బారికేడ్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

హైద రాబాద్‌లో వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కోరారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. సమస్యాత్మక నాలాల వద్ద అవసరమైతే ప్రతి రోజూ క్లీనింగ్ చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్తు నిర్వహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. కష్టపడి పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని, ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. వరద తీవ్రత, విద్యుత్, శాంతి భద్రతలు సహా అనేక అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఇతర అధికారులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై నార్కోటిక్స్, డ్రగ్స్ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే చైన్‌ను బ్రేక్ చేయాలని, వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని అన్నారు. డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలున్నా, ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించవద్దని తెలిపారు.

అవసరమైతే యాంటీ డ్రగ్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేసేవారిని ప్రోత్సహించాలని కోరారు. డ్రగ్స్‌ను నాశనం చేసేందుకు ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. డ్రగ్స్ అనే పదం వింటేనే భయపడేలా చర్యలుండాలని, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) ఆదర్శంగా మారాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.