నూతనకల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
నూతనకల్, మార్చి 24 : ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం నూతనకల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ పరిసరాలను, పోలీస్ రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల నమోదు తీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, రికార్డుల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ, వారికి పూర్తి భరోసా కల్పించాలని సూచించారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందించి, బాధితుల ఫిర్యాదులను నమోదు చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సామాజిక కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది అందరూ సమన్వయంతో, ఒక జట్టుగా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్‌ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.




