తమిళనాట త్రిముఖ పోరు
తమిళనాట గతానికి భిన్నంగా ప్రస్తుతం రాజకీయ ముఖచిత్రంలో త్రిముఖపోరు హోరాహోరీగా సాగుతున్నది. ఈ నెల 23న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే.. మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతూ ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నాయి. ద్రవిడ ఆధిపత్య రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో పట్టు సాధించాలని, పాగా వేయాలని ఎంతో కాలంగా జాతీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీ ప్రయత్నిస్తున్నది.
ఈ క్రమంలోనే అన్నాడీఎంకేతో పొత్తులో ఉండి కూడా ప్రముఖ సినీ నటుడు, టీవీకే (తమిళగ వెట్రి కజగం) అధినేత విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నాలు చేసింది. కానీ, కమలం పార్టీకి చివరికి నిరాశే ఎదురైంది. తమిళనాడులో ప్ర స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై విజయ్ మొదటినుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఢీ అంటే ఢీ అంటున్నారు. అంతేకాదు, తమిళనాట పోటీ డీఎంకే, టీవీకే మధ్య మాత్రమేనంటూ ధీమాగా చెబుతున్నారు.
ప్రతీ ప్రచార సభలో ‘విజిల్’ గుర్తుకు ఓటు వేయాలని జనాన్ని అభ్యర్థిస్తున్నారు. విజయ్ ప్రఖ్యాత నటుడు కావడంతో ఆ పార్టీ సభలకు పెద్దఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. అయితే, సభల కు పోటెత్తుతున్న అభిమానులు, ప్ర జలు ఓటుబ్యాంకుగా మారుతారా, లేదా? అన్నది తెలియాలి. అభిమాన గణం ఏ మేరకు ఓటు వేస్తారనేది ఇక్కడ అత్యంత కీలకం. తమ సైద్ధాంతిక శత్రువుగా బీజేపీని అభివర్ణించిన విజయ్..
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేను పూర్తిస్థాయిలో టార్గెట్ చేయడం వెనక బలమైన వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాల పాటు తమిళనాడును ఏలిన కరుణానిధి, జయలలితల మరణం తర్వాత తమిళనాట కొంత రాజకీయ శూన్యత ఏర్పడింది. కరుణానిధి మరణానంతరం డీఎంకే సారథి ఎంకే స్టాలిన్ అధికారంలోకి వచ్చారు. ‘ద్రవిడియన్’ మోడల్ పేరుతో ఆయన జనంలోకి వెళ్తున్నారు.
ఇక జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండాపోయింది. జయలలిత స్థాయిలో ఆ పార్టీని నడిపించే నేత ఇంకా వెలుగులోకి రాలేదు. ఆ పార్టీ నాయకులు కూడా ఏకతాటిపై లేరు. ఓ పన్నీరు సెల్వం (ఓపీఎస్) డీఎంకేలో చేరగా, వీకే శశికళ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం, కార్యకర్తలు, వ్యవస్థ కలిగిన డీఎంకేను టార్గెట్ చేయడం ద్వారా తాను కింగ్ లేదా కింగ్ మేకర్ కాగలననే అంచనా మేరకే విజయ్ ప్రతీసారి ‘స్టాలిన్ అంకుల్’ అంటూ డీఎంకే లీడర్‌ను టార్గెట్ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అంతేకాదు, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచీ విజయ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భారీగా జనసమీకరణ చేస్తూ, నాయకులను పార్టీలో చేర్చుకుంటూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నారు. అందులో భాగంగానే భారీ సభలు నిర్వహిస్తూ వచ్చారు. జయలలిత లేని అన్నాడీఎంకే నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నది. తమిళనాడులో బలమైన ప్రతిపక్షం లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది.
ఈ లోటును పూడ్చి కింగ్‌గా మారాలని ఆయన యోచిస్తున్నారు. తమిళనాడులో ఆనవాయితీగా వస్తున్న ప్రభుత్వ మార్పు అనే విధానం మళ్లీ తెరపైకి వస్తే, డీఎంకే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే కొత్తగా ఎన్నికల గోదాలోకి దిగిన టీవీకే పార్టీని డీఎంకే నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తూ, అన్నాడీఎంకేను పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, జనం ఎవరి వైపు నిలబడి ‘విజయం’ చేకూరేలా చేస్తారనేది మాత్రం వచ్చే నెల 4న తేలనుంది.
అంబీర్ శ్రీకాంత్, సెల్: 8185968059




