బడుగుల మార్గదర్శి ఫూలే
ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ :
* కార్మికులు, రైతులు, మహిళల స్వేచ్ఛ, హక్కుల కోసం ఫూలే అలుపెరుగని పోరు చేశారు. తన రచనల ద్వారా కూడా సమాజాన్ని మేల్కొల్పారు. మరీ ముఖ్యంగా పత్రికల ద్వారా ప్రచారం చేసి వారిలో ప్రశ్నించే తత్వాన్ని పెంచారు.
ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా
స్వతంత్ర భారతాన గాంధీజీ మహాత్మా అయితే, స్వతంత్ర భారతానికి వందేళ్ల ముందే బడుగు బలహీన వర్గాలచే మహాత్ముడిగా జన నీరా జనాలు అందుకున్న సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త జ్యోతిరావు ఫూలే. నాడు సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన, బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే కొత్తదారి చూపారు.
శూద్ర, అతిశూద్రుల పరిస్థితులు బాగుపడాలంటే విద్య ఒక్కటే ఆయుధమని, విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చాటిచెప్పిన ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబం లో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. 13 ఏళ్ల వయస్సులోనే సావిత్రిబాయి ఫూలేను ఆయన వివాహమాడారు. ఈ వివాహం ఆయన ఆశయాలకు జీవం పోసింది. మారిన రాజకీయ పరిస్థితులు ఫూలే పాఠశాలకు వెళ్లడానికి వీలు కల్పించాయి.
1847-48లో తన విద్యాభ్యాసాన్ని ఆయ న పూర్తి చేశారు. మొదట మరాఠీ మాధ్య మ సంస్థలో చదివి, తరువాత పూణేలోని స్కాటిష్ మిషన్ హైస్కూల్లో చేరారు. ఆ పాఠశాల యువ ఫూలేకు ఆధునిక విద్యను అందించింది. ఫూలేకు ఛత్రపతి శివాజీ అంటే అభిమానం ఎక్కువ. జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్రలు చదివి ఆయన ప్రభావితమయ్యారు.
అది ఆయన ప్రపం చ దృక్పథాన్ని తీర్చిదిద్దింది. స్త్రీలు విద్యావంతులు కావాలని తన సతీమణి సావి త్రిబాయి ఫూలేకు చదువు నేర్పించి, మన దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలి గా తీర్చిదిద్దిన సంఘ సంస్కర్త, ఉద్యమకారుడు, సమాజ సేవకుడు, భారతదేశంలో సామాజిక సంస్కరణలకు బీజం వేసిన మొదటి మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని సగర్వంగా చెప్పవచ్చు.
సామాజిక న్యాయం సాధించకుండా, బ్రిటిష్ పరిపాలనా నిర్ణయాల వెనుక బ్రాహ్మణుల కుయుక్తులు తెరవెనుక ఉన్నాయని ఫూలే భావించారు. ఫూలే జీవితంలో జరిగిన రెండు ముఖ్యమైన సం ఘటనలు ఆయన జీవితకాల కృషికి పునా ది వేశాయి. మొదటిది, థామస్ పైన్ రచనలు ‘ది ఏజ్ ఆఫ్ రీజన్’, ‘రైట్స్ ఆఫ్ మ్యాన్’ ఆయనలో మానవత్వం, విలువ లు, స్వేఛ్చా, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపజేసింది.
ఇక రెండవది, అతని నిమ్న కుల మూలాల కారణంగా ఒక బ్రాహ్మణ పరిచయస్తుడి వివాహ ఊరేగింపులో జరిగిన అవమానం సామాజిక ఉద్యమకారుడిగా ఆయనను తీర్చిదిద్దింది. బహుశా విగ్రహారాధనను వ్యతిరేకించే లోతైన సామాజిక నిమగ్నతతో కూడిన జీవితాన్ని ప్రారంభించడానికి అతనికి అవసరమైన ప్రేరణ ఇక్కడ నుంచే మొదలైంది. ఫూలే ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ఆయన ను ఒక సాంఘిక సంస్కర్తగా, ఉద్వేగభరితమైన రచయితగా గుర్తించినప్పటికీ, విద్యా రంగంలో ఆయన చేసిన మార్గదర్శక కృషి చాలా వరకు విస్మరించబడింది.
జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడానికి అభ్యంతరం చెప్పి, వేదాలకు కొత్త భాష్యం చెప్పిన భాష్యకుడాయన. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని గ్రహించిన ఫూలే స్త్రీ విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమని బలంగా విశ్వసించారు. ఫూలే నిమ్న కులాల బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను 1848 ఆగస్టులో పూణెలో ప్రారంభించారు. ఈ పాఠశాలలో నాడు అంటరానివారు సహా అన్ని కులాల వారికీ ప్రవేశం కల్పించి, స్త్రీల పై నాడున్న కట్టుబాట్లను ఉల్లంఘిస్తూ మహిళల మహోద్దరణకు కృషి చేశారు.
మహాత్మా ఫూలే 1858 తర్వాత, విద్యారంగాన్ని దాటి రచనలతో సహా అనేక కార్యకలాపాలను చేపట్టారు. ఆయన రచనలలో చాలా వరకు, కుల వ్యవస్థ పనితీ రును సమర్థించేందుకు ప్రయత్నించే ప్రబలమైన బ్రాహ్మణీయ మత సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. ఆయన ఒకవైపు శూద్రతీశూద్ర ప్రజలకు సాధికారత కల్పించడం, మరోవైపు బ్రాహ్మణీయ ఛాందసవాదాన్ని, హిందూ సమాజాన్ని పైనుంచి ‘సంస్కరించడానికి’ బ్రాహ్మణులలో ఒక వర్గం (ప్రగతిశీల బ్రాహ్మణులు అని పిలవబడేవారు) చేసే ప్రయత్నాలను బహిర్గతం చేయడం లక్ష్యంగా తీవ్రమైన సాంఘిక క్రియాశీలతలో కూడా నిమగ్నమయ్యారు.
నాటి సమాజంలో మూఢాచారాలైన కన్యాశుల్కం, బాల్య వివాహాలకు వ్యతిరేకం గా ఫూలే పోరాటాలు చేశారు. భావసారూప్యత కలవారందరిని ఏకతాటిపైకి తీసుకు వచ్చి సమాజానికి ఒక కొత్త మార్గాన్ని చూపారు. చిన్న వయస్సులో వితంతువులైన వారికి స్వయంగా వివాహాలు జరి పించారు. 1864లో ‘బాలహత్య ప్రధిబంధక్ గృహ’ను స్థాపించారు. నాటి సమా జంలో వితంతువులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను గ్రహించి వారి కోసం ఆశ్రమాన్ని స్థాపించారు.
వితంతు మహిళలకు శిరోముండనం చేసే ఆనవాయితీకి స్వస్తి పలకాలన్నారు. శిశుహత్యలు, బాల్యవివాహాల నివారణ కోసం ప్రత్యేక చొరవ తీసుకొని అండగా నిలిచారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారతదేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన ఫూలే తన గురువు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించిన విషయాన్నీ మనం గుర్తుచేసు కోవాలి.
భారతదేశంలో బ్రాహ్మణులు ఎలా ఉనికిలోకి వచ్చారో, మధ్య ఆసియాలో వారి మూలాలు, మోసపూరిత మార్గాల ద్వారా భూములను వారు ఎలా ఆక్రమించుకున్నారో ‘పవిత్ర’ గ్రంథాలలో బ్రాహ్మ ణులకు అనుకూలమైన అనేక భాగాలను ఎలా చొప్పించారో తద్వారా శూద్రతీశూద్రులను ‘దైవ ఆమోదిత’ బానిసత్వపు అగాధంలోకి నెట్టిన అనేక పద్ధతులను సంస్థాగతం చేయడం ద్వారా బ్రాహ్మణ ఆధిపత్యం ఎలా ప్రారంభంలోనే స్థాపించబడిందో 1873లో ప్రచురితమైన ‘గులాం గిరి’ (బానిసత్వం) గ్రంథంలో ఫూలే స్పష్టంగా వివరించారు.
దేశమనే దేశానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల లాంటి వాళ్లు అని పేర్కొన్న మహాత్మా ఫూలే చివరి శ్వాస వరకు సమాజాన్ని సంస్కరింంచా రు. అదే సంవత్సరం సెప్టెంబర్ 24న సత్యం సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సత్యశోధక సమాజాన్ని ఫూలే స్థాపించారు. దేశంలోనే ఇది మొట్టమొద టి సంస్కరణోద్యమం. శూద్రులు- అతిశూద్రులపై నాటి సమాజంలోని కొన్ని వర్గా లు ప్రదర్శించే క్రూర వైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించారు.
కార్మికులు, రైతులు, మహిళల స్వేచ్ఛ, హక్కుల కోసం ఆయన అలుపెరుగని పోరు చేశారు. తన రచనల ద్వారా కూడా సమాజాన్ని మేల్కొల్పారు. మరీ ముఖ్యంగా పత్రికల ద్వారా ప్రచారం చేసి వారిలో ప్రశ్నించే తత్వాన్ని పెంచారు. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా వారి సాధికారత కోసం తపించిన మహాత్మా ఫూలే 1890 నవంబరు 28న తుది శ్వాస విడిచారు.
ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభు త్వం సామాజిక బాధ్యతగా కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలో భాగంగా సుమారు 4 కోట్ల వ్యయంతో నెక్లస్ రోడ్డులో 16 అడుగుల ఎత్తులో జిగేల్‌మనే వెలుగుల్లో ఫూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న ఆ విగ్రహాలను ఆవిష్కరించడానికి ఏర్పా ట్లు చేయడమే నేడు మనం వారికి అర్పిస్తున్న ఘనమైన నివాళి.
వ్యాసకర్త సెల్: 98662 55355




