11 April, 2026 | 2:05 AM

ఉచితాలు-అనుచితాలు

11-04-2026 12:00 AM

ఉచితాలు అనుచితాలన్నది ఆర్థిక విశ్లేషకుల మాట. ఉచిత పథకాలు ఎప్పటికైనా అనర్థదాయకయే. ఎన్నికల్లో అయాచిత లబ్ధి పొందేందుకు, ఓటర్లను ఆకర్షించి ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు లాంటివి. పన్ను చెల్లింపుదారుల సొమ్ము దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. కానీ, రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల పన్నుల చెల్లింపుదారుల సొమ్మును ఉచిత పథకాలకు మళ్లించడం సరికాదు.

సాక్షాత్తూ మన దేశ ప్రధాని మోదీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలో ఎన్నికల వేళ ఏం జరుగుతున్నదనేది మనందరం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి మరొకటి హామీల వర్షం కురిపిస్తున్నాయి. గ్యారంటీలు, వారంటీల పేరిట మ్యానిఫెస్టోలను నింపేస్తున్నాయి. అధికార పార్టీ ఒకటంటే, తామేమైనా తక్కువ తిన్నామా? అంటూ ప్రతిపక్ష పార్టీ రెండంటున్నది.

ఉచితాల పంపిణీ ట్రెండ్ ఈమధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రజలు కూడా అభివృద్ధి పథకాలు, ప్రగతి కార్యక్రమాల కంటే నేరుగా తమకు లబ్ధి చేకూర్చే ఉచితాలకే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అలాంటి హామీలు ఇచ్చిన పార్టీలకే పట్టం కడుతున్నారు. మొన్నటికి మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లోనూ ఇలాంటి ధోరణిని చూశాం. నితీశ్ కుమార్ సర్కార్ ఎన్నికలకు ముందు అమల్లోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన వల్లనే ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధించిందని చెప్పడంలో సంశ యం అక్కర్లేదు.

ఈ పథకంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.7,500 కోట్లను నితీశ్ సర్కార్ జమ చేసిన విషయం విదితమే. ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరుగుతున్న కేరళ, అసోం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలోనూ ఇదే తంతు నడుస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో ఇలాంటి ఉచిత పథకాలకే పెద్దపీట వేశాయి. ముఖ్యంగా ఓటర్లలో సగ భాగం ఉన్న నారీశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయపక్షాలకు ఇలాంటి రేవడీలు పనికొస్తున్నాయి.

మహిళల ఖాతాల్లో నెలనెలా నగదు జమ, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థినులకు స్కూటీలు, ఉచిత గ్యాస్ పంపిణీ లాంటి హామీలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ మహిళలకు నెలకు రూ.2 చొప్పున ఇస్తానని ప్రకటిస్తే, ప్రతిపక్ష పార్టీలు రెట్టింపు ఇస్తామని చెప్తున్నాయి. పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే, లక్ష్మీభండార్ పథకం కింద మహిళలకు నెలకు రూ.వెయ్యి చొప్పున అక్కడి టీఎంసీ సర్కార్ ఇస్తుండగా, తాము అధికారంలోకి వస్తే రూ.2 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా, బీజేపీ మరో అడుగు ముందుకువేసి రూ.3 వేలు ఇస్తామని ప్రకటించింది.

ఇక తమిళనాడు విషయానికి వస్తే అధికార డీఎంకే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తుండగా.. ప్రతిపక్ష అన్నాడీఎంకే ఏకంగా పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామంటున్నది. కేరళ, అసోం, పుదుచ్చేరిలోనూ ఇదే తంతు కొనసాగింది. ఈ ధోరణి దేశ ప్రగతికి అవరోధంగా మారుతున్నది. ప్రభుత్వాలు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఇలాంటి ఉచితాల అవసరమే ఉండదు. అప్పుడే ప్రజల జీవితాలు మారడంతోపాటు దేశమూ ప్రగతిపథంలో దూసుకెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.