త్యాగయోగి ‘స్వరార్ణవం’ త్యాగరాజు
తెలుగు వారంతా గర్వపడిన మహాయోగి, త్యాగ యోగి. త్యాగరాజు రచయిత అయిన స్వరార్ణవం త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత దినోత్సవం. నాదయోగి అయిన త్యాగరాజు 1767వ సంవ త్సరం మే 4 వ తేదీన (లేదా 5 అని కొంద రు అంటున్నారు) జన్మించారు. అంతగా దొరికే ప్రామాణిక వివరాలు లేవు. 1847 జనవరి 6 నాడు ఈ గానబ్రహ్మ పరమబ్రహ్ముక్యమైనారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు 5 జనవరి, ఫిబ్రవరి నెలలలో తిరువయ్యూరులో సమాధి చెందిన త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు.
త్యాగరాజు మద్రాస్ ప్రెసిడెన్సీ (ఇప్పటి తమిళనాడు)లో జనవరి 6, 1847న పరమపదించారు, కళా ప్రక్రియ అనే కర్ణాటక భారతీయ స్వరకర్త ఆయన. కీర్తన, కృతి, రాగ స్రష్ట. బహుళ ప్రక్రియల్లో భక్తి పాటలకు పెట్టిన పేరు త్యాగరాజు. దక్షిణ భార త శాస్త్రీయ సంగీత చరిత్రలో మరచిపోవ డం సాధ్యం కాదు. సమకాలీన కర్ణాటక సుప్రసిద్ధ గాయకులు, సంగీతకారులచే సన్మానాలు సాధించిన వారు. త్యాగరాజు వేలాది కృతుల సంగీతాన్ని, పదాలను స్వరపరిచారు.
19వ శతాబ్దంలో కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ముఖ్యుడు ఈ త్యాగరాజ స్వామి. మరో ఇద్దరు శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వారు. ఇద్దరికీ సమకాలికుడీయన. వీరు ముగ్గురూ తమిళనాడు లోని తంజావూరు జిల్లా తిరువాయ్యూరుకు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలు గు, సంస్కృతాల్లోనే సాగింది. త్యాగయ్య వేల కీర్తనలను రచించినా ఇప్పుడు లభ్యమవుతున్నది దాదాపు 800 కీర్తనలు మాత్రమే. ముఖ్యంగా తెలుగులో కీర్తనలు రచించి స్వర రచన చేసి పాడిన మహానుభావుడు. ఎక్కువ కాలం తంజావూరులో ఉన్నారు.
రామేతి మధురం
‘రామేతి మధురం వాచం’ అని పెద్దలు చెప్పినందుకు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించిన వాడు త్యాగరాజు. ఎంత ఆశ్చర్యం. నాదోపాసన ద్వారా భగవంతు ని చేరుకోవచ్చని నిరూపించిన వాడు త్యాగయ్య. ఆయన శ్రీరామభక్తి అజరామరమైంది. రామకృష్ణానంద పరబ్రహ్మం గారు రామ షడక్షరీ మంత్రాన్ని 18 ఏళ్ల వయసులోనే త్యాగరాజుకు ఆశీర్వదించారు.
తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా తిరువారూర్ గ్రామంలో కాకర్ల త్యాగబ్రహ్మం పేరుతో జన్మించాడు. కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతులలో మూడవ కుమారుడు. ములకనాడు తెలుగు బ్రాహ్మణులనీ, భరద్వాజ గోత్రీకు లు, త్రిలింగ వైదికులనీ, ఆపస్తంభ సూత్రులనీ వారు. త్యాగరాజు పూర్వీకులు ప్రకా శం జిల్లా, కంభం మండలం కాకర్ల గ్రామం నుంచి తంజావూరు వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆస్థానంలో ఉండేవారు. త్యాగరాజు తాత గిరిరాజ కవి తెలుగు వాగ్గేయకారుడు.
రామబ్రహ్మం దంపతులకు నారదుడు స్వప్నంలో కనిపించి ఒక కుమారుడు జన్మిస్తాడన్నారనీ, ఆయనకు త్యాగరాజు నామ కరణం చేయాలని ఆదేశించారట. కనుక, నారద ముని మంత్రోపదేశంతో త్యాగరాజస్వామి ‘స్వరార్ణవం’, ‘నారదీయం’ అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథాలు, ‘ప్రహ్లాద భక్తి విజయం’, ‘నౌకా చరితం’ అనే నాట్యరూపకాలను కూడా రచించారు.
త్యాగయ్య తెలుగు తమిళ భాషలకే కాకుండా దేశానికి, ఈ ప్రపంచానికి నాదానికి యోగి. పాటకు రాజు, రాగానికి రారా జు త్యాగరాజు. త్యాగయ్యను
వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః
వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం
బ్రహ్మా నారద ఏవచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః
యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే
అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝాపేట వేంకటరమణయ్య భాగవతార్ ఈ శ్లోకాన్ని ప్రస్తుతించారు. ఒక అద్భుతం గా ఈ అర్థాన్ని వివరించారు. “వేదములను విప్పి చెప్పడంలో ఆయన వ్యాసుడు. మధురమైన వాక్యముల రచనలో వాల్మీకి కవి. వైరాగ్యములో శుకుని వంటివాడు. భక్తిలో ప్రహ్లాదుని వంటివాడు. సాహిత్యములో బ్రహ్మ వంటివాడు. సంగీతములో నారదుని వంటివాడు. రామ నామమనే అమృతాన్ని త్రాగడంలో పరమశివుని వంటివాడు” అని రచయితలు అక్కిరాజు ప్రసాద్, రవిరాజు ఆదిరాజు కలిసి రాసిన వ్యాసంలో వివరించారు.
సుందరకాండలో స్ఫూర్తి
తల్లి పాలు తాగుతున్న పసిబాలుడు సంగీతం వినబడితే పాలు త్రాగడం ఆపి తల తిప్పి సంగీతం వినేవారట. ఒకసారి రామబ్రహం తన కుటుంబంతో కాశీ ప్రయణం అవుతుండగా ఆ త్యాగరాజస్వామి (శివుడు) మళ్లీ స్వప్నంలో కనబడి తిరువైయారు వెళ్లమని, అదే అతనికి కాశీతో సమానమని చెబుతాడు. రామబ్రహ్మం ఈ విషయం రాజావారికి తెలుప గా అయన తిరువైయారులో రామబ్రహ్మానికి ఒక ఇల్లుతోపాటు ఆరెకరాల పొలం ఇచ్చారని వివరించారు. త్యాగరాజస్వామి కీర్తనల్ని ‘త్యాగరాజు ఆత్మ విచారం’ పేరిట గొప్ప వచనంగా భమిడిపాటి కామేశ్వరరావుగారు ప్రచురించారు. కాటూరి వెంకటే శ్వరరావుగారు సాహిత్య అకాడెమీ కోసం ‘తెలుగు కావ్యమాల’ను కూడా ఒక సంకలనం చేశారు. ఎన్.విజయ శివ అనే మరో రచయిత త్యాగరాజ కీర్తనలకి స్ఫూర్తి రామాయణంలోని సుందరకాండలో ఉందని వివరించారు. ఆనాటి సుప్రసిద్ధ త్యాగరాయ కృతి, పంచరత్న కీర్తనల్లో ఒకటైన ‘ఎందరో మహానుభావులు’ కి స్ఫూర్తి సుందరకాండలో (26:50) సీతాదేవి పలికిన ఈ శ్లోకంలో ఉందంటాడాయన..
ప్రియాన్న సంభవే ద్దుఃఖమప్రియా దధికమ్ భయమ్
తాభ్యామ్ హియే వియుజ్యంతే నమస్తే షామ్ మహాత్మానామ్
(ప్రియమైనది దొరకలేదనే దుఃఖం గాని, అప్రియం నుండి గొప్ప భయం కాని ఉండని ఆ మహాత్ములెవరో, ప్రియాప్రియాలు రెండింటికీ దూరంగా ఉండేవారె వరో ఆ మహాత్ములకు నమస్కారం అని అర్థం).
గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ‘ఎందరో మహానుభావులు’ (మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కీర్తన వినవచ్చు) అనే కీర్తనను స్వరపరచి పాడారు. పదమూడేండ్ల చిరుప్రా యం నాడే త్యాగరాజు ‘నమో నమో రాఘ వా’ అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరిచారు.
ఈ నాదయోగి కాకర్ల త్యాగరాజస్వామి, పుష్య బహుళ పంచమి 1847 సంవత్సరాన సిద్ధి పొందిన రోజు. తిరువాయ్యూ రులో కావేరీ తీరాన శిష్యులందరూ చూస్తూ ఉండగా విదేహముక్తి పొందిన యోగి ఆయన. త్యాగరాజుస్వామి చరిత్ర రూపంలో ప్రధానంగా రచించిన వారు ఆయన శిష్యులు వేంకటరమణ భాగవతార్, కృష్ణస్వామి భాగవతార్ గార్లు. వీరి ద్దరు తండ్రీ కొడుకులు. తండ్రి త్యాగయ్య జీవితంలోని మొదటి భాగం విశేషాలు ఇస్తే, కృష్ణస్వామి భాగవతార్ రెండవ భాగం విశేషాలు రచించారు. అవి తాళపత్రాలలో. నోటుబుక్కుల రూపంలో ఉన్న త్యాగయ్య సాహిత్యాన్ని మదురైలోని సౌరాష్ట్ర సభలో పదిల పరిచారట. అక్కడే త్యాగయ్య ఉపయోగించిన తంబుర మొదలైన అపురూపమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కూడా త్యాగరాజస్వామి వారి చరిత్రను తెలుగులోనే రచించారు. ప్రముఖ సంగీత పరిశోధకులు పీ. సాంబమూర్తి గారు కృష్ణస్వామి గారిని స్వయంగా కలిసి, వారి జీవితశైలిని గమనించి కొన్ని సంభాషణలకు పుస్తక రూపం కూడా ఇచ్చారు. ఆ తండ్రీ కొడుకుల జీవితంపై త్యాగయ్య సాహిత్య ప్రభావం పరిపూర్ణంగా ఉందని సాంబమూర్తి గారు చెప్పినట్లు అక్కిరాజు ప్రసాద్ తెలిపారు. రవిప్రసాద్ ఆదిరాజు కూడా ఆయనకు సహాయం చేసారు. ఈ సందర్భంలో చెప్పవలసిన మరొక విషయం ఏమంటే సామవేదం షణ్ముఖ శర్మ ‘త్యాగరాజ వైభవం’ అని ఏడు భాగాలలో చేసిన ప్రవచనం తప్పకుండా విని తీరవలసినది. ఇది ఏ పుస్తకంలోనూ దొరకదు, ప్రవచన ప్రధానమని అర్థం. Tyagaraja Vaibhavam (త్యాగరాజ వైభవం) by Samavedam Shanmukha Sharma https://tunes.desibantu. co m/tyagaraja -vaibhavam/.
మాడభూషి శ్రీధర్






