11 May, 2026 | 3:33 PM

మానవీయ సాయానికి ఎర్ర తివాచీ

08-05-2024 12:10 AM

‘రెడ్ క్రాస్’ అనేది ఒక సామాజిక, స్వచ్చంధ సేవా సంస్థ. హెన్రీ డునాంట్ అనే స్విట్జర్లాండ్ దేశస్తుడు 1864లో ఈ సంస్థని ప్రారంభించారు. ఇటలీ, ఆస్ట్రియాల మధ్య జరిగిన యుద్ధంలో క్షతగాత్రులైన వారిని చూసి భాధ పడి వీరు దీనిని స్థాపించారు. స్విట్జర్లాండ్ జండాలో ఎర్రని బ్యాక్ గ్రౌండ్ లో తెల్లని క్రాస్ వుంటుంది. దానిని తారుమారు చేసి తెల్లని బ్యాక్ గ్రౌండ్‌లో ఎర్రని క్రాస్‌ని ఏర్పరిచారు. హెన్రీ 1812 మే 8న జన్మించారు. ఈ సందర్బంగానే మే 8న ‘ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం’ జరుపుకుం టున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలను ఆదుకొని, చేయూతనిస్తూ, వారందరి గౌరవార్థం ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపు తారు. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీని స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో స్థాపించారు. హెన్రీ డునాంట్ ‘నోబెల్ శాంతి బహుమతి’ గ్రహీ త కూడా. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం, అంటువ్యాధులతో బాధ పడుతున్న పేదప్రజలకు మానవతా సాయం అందిస్తారు. 

పేద ప్రజలకు అభయం

అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజల సహాయార్థం ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద, సేవాసంస్థలు, వలంటీర్లు క్రియాశీల పాత్రను పోషిస్తున్నాయి. ‘మొదటి ప్రపంచ యుద్ధం’ తర్వాత 14వ అంతర్జాతీయ సదస్సులో అంతర్జాతీయ కమిషన్ శాంతికి ప్రధాన సహకారిగా ‘రెడ్‌క్రాస్’ను ప్రవేశపెట్టింది. 1934లో టోక్యోలో 15వ అంతర్జాతీయ సదస్సులో రెడ్‌క్రాస్ ట్రూస్ సూత్రాలను ఆమోదించారు. వాటిని ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాకు వర్తింపచేసేలా కృషి చేశారు. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని జరుపుకునే ప్రతిపాదనను కూడా 1948న మే 8న ఆమోదించారు. 1984లో అధికారికంగా ‘ప్రపంచ రెడ్‌క్రాస్ రెడ్ క్రెసెంట్ డే’ అని పేరు పెట్టారు. అంతర్జాతీయంగా మానవతా కార్యకలాపాలను సులభతరం చేయడానికి, ప్రోత్సహించడానికి అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ, దాని సభ్యులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

రెడ్‌క్రాస్‌కు చెందిన అన్ని సంస్థలు ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం. వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలతో బాధ పడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి, అత్యవసర పరిస్థితుల నుండి వారి ప్రాణాలను రక్షించడానికి ఈ సంస్థలు నిరం తరం కృషి చేస్తాయి. ప్రతి దేశం, రాష్ట్రాలలో రెడ్‌క్రాస్ శాఖలు వున్నాయి. ఆయా రాష్ట్రాలలో రెడ్‌క్రాస్ సంస్థలకు చైర్మన్లుగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరించడం జరుగుతూ వుంది. ప్రతీ జిల్లాల్లో కూడా రెడ్‌క్రాస్ శాఖలు ఉన్నాయి. వీనికి జిల్లా కలెక్టరులు కన్వీనర్‌గా భాద్యతలు నిర్వహిస్తుంటారు. రెడ్‌క్రాస్ పాలక మండలి సభ్యులు, కార్యవర్గం ఆయా జిల్లాల్లో కొనసాగుతూ వున్నా రు. ముఖ్యంగా రెడ్‌క్రాస్ సంస్థద్వారా గ్రామాలు, పట్టణాలలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, లక్షలాది యూనిట్ల రక్తం సేకరించి, తలసేమియ వ్యాధితో బాధపడే వారికి అందచేసి, వారి ప్రాణాలు కాపాడు తూ వున్నారు. బాల రెడ్‌క్రాస్ శాఖలు కూడా వివిధ జిల్లాల్లో పనిచేస్తూ వున్నాయి. 

 కామిడి సతీష్ రెడ్డి

వ్యాసకర్త సెల్: 9848445134