17 June, 2026 | 11:34 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిశీలన పాలనకు మార్గదర్శకం కావాలి

05-02-2026 12:50 PM

ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతికుమారి

అచ్చంపేట: గ్రూప్–1 అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన శిక్షణ తరగతులను ఆసక్తితో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ వైస్ చైర్మన్ శాంతికుమారి అన్నారు. ఎంసీహెచ్‌ఆర్డీ ఆధ్వర్యంలో గ్రూప్–1 అధికారులకు నాగర్ కర్నూల్ జిల్లాలో 2 బ్యాచులుగా గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న నల్లమల్ల అటవీ ప్రాంత ట్రెక్కింగ్ మరియు స్టడీ టూర్ శిక్షణ తరగతుల చివరి రోజు గురువారం  నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి ఎంసిహెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతకుమారి సందర్శించారు.

అచ్చంపేట గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో శిక్షణ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో సందర్శించిన వివిధ ప్రదేశాల వివరాలు, అక్కడ పొందిన అనుభూతులను శిక్షణ పొందుతున్న గ్రూప్–1 అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా పరిపాలనా వ్యవస్థను నేరుగా అవగాహన చేసుకునే అవకాశం లభిస్తుందని ఆమె అన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకొని సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ తరహా శిక్షణ భవిష్యత్తు పాలనకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సన్నద్ధం కావాలని కోరారు.

అధికారులు బాధ్యతాయుతంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, పొందిన అనుభవాన్ని తమ విధుల నిర్వహణలో అమలు చేయాలని ఆమె సూచించారు. నల్లమల్ల అటవీ ప్రాంతానికి విశేష ప్రాముఖ్యత ఉందని, ముఖ్యంగా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు చెంచు గిరిజనుల జీవన విధానం అడవితో విడదీయరాని బంధంగా ముడిపడి ఉందని ఆమె పేర్కొన్నారు. చెంచు గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని గ్రూప్–1 అధికారులకు సూచించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ... నాగర్ కర్నూల్ జిల్లా యంత్రాంగం గత 3 రోజులుగా గ్రూప్ వన్ అధికారులకు నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో శిక్షణ ట్రేక్కింగ్ ప్రదేశాల సందర్శన విజయవంతం చేసేలా కృషి చేయడం జరిగిందని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయి సందర్శన శిక్షణతో నేర్చుకున్న ప్రతి అంశాన్ని ప్రజలకు మంచి పాలన అందించేలా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ అధికారులు సూచించారు. గురువారం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం ట్రేక్కింగ్ కు శిక్షణ అధికారులతో కలిసి శాంతి కుమారి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.