18 July, 2026 | 1:17 AM

రాజన్న కళ్యాణకట్ట ‘కట్టుదిట్టం’

18-07-2026 01:17 AM
  1. నిఘా వ్యవస్థతో  ‘అదనపు’ వసూళ్లకు చెక్
  2. రూ.50కే తలనీలాల సేవ
  3. పారదర్శక సేవలపై ఈవో రమాదేవి దృష్టి

వేములవాడ, జూలై 17 (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలోని కళ్యాణకట్టలో భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఆలయ యంత్రాంగం స్పందించింది. భక్తులకు అందే సేవల్లో పారదర్శకత తీసుకురావడంపై దృష్టి సారించిన ఆలయ ఈవో రమాదేవి చేపట్టిన చర్యలతో కళ్యాణకట్టలో నిబంధనల అమలుకు శ్రీకారం చుట్టారు.

ఇటీవల కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకునే భక్తుల నుంచి నిర్ణయించిన రుసుము కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఈవో స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు నాయీబ్రాహ్మణుల పనితీరు, కాంట్రాక్టర్ నిర్వహణ తీరుపై ఆరా తీశారు. తనిఖీల్లో భాగంగా కళ్యాణకట్టలో పనిచేస్తున్న నాయీబ్రాహ్మణుల వివరాలను సేకరించి, వారికి అందుతున్న వేతనాలు, సౌకర్యాలపై ఆరా తీశారు.

సేవల్లో మరింత పారదర్శకత కోసం ప్రతి సిబ్బందికి యూనిఫాం, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా అందించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఈవో స్పష్టంచేశారు. అక్రమ వసూళ్లపై భక్తుల్లో అవగాహన కల్పించేందుకు కళ్యాణకట్టలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. తలనీలాల టికెట్ ధర రూ.50 మాత్రమేనని, నాయీబ్రాహ్మణులకు ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించవద్దని బోర్డుల ద్వారా స్పష్టంచేశారు.

భక్తులకు నిరంతరం సమాచారం అందించేలా మైక్ ద్వారా ప్రకటనలు చేసే ఏర్పాట్లు చేశారు. కళ్యాణకట్టలో నగదు లావాదేవీలపై నిఘా పెంచేందుకు ప్రత్యేకంగా ఇద్దరు సిబ్బందిని నియమించాలని ఈవో ఆదేశించారు. మొత్తం ప్రాంగణం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకుని, ఫుటేజీ ఆధారంగా ఫిర్యాదులను పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల నుంచి ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేసినా, వసూలు చేసినా వెంటనే దేవస్థానం అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈవో కోరారు.