calender_icon.png 9 June, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలం కలిసి రావడానికి మూలం!

04-06-2025 12:00:00 AM

శత్రువు దండెత్తి వచ్చిన సమయంలో ఈరోజు బాగా లేదని, ఇది దుర్ముహూర్తమని, రాహుకాలమని కూర్చుంటే పరాజయమే కాదు, ప్రాణాంతకమూ కావచ్చు. అయితే, అనుకోని కారణాలవల్ల ఒక్కొక్కప్పుడు వరుసగా అపజయాలు పలకరించవచ్చు లేదా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.

నక్షత్ర మతి పృఛ్ఛంతం 

బాల మర్థో తివర్ధతే

అర్థోహ్యర్థస్య నక్షత్రం 

కిం కరిష్యంతి తారకాః॥

 (9.-4)వ్యవసాయం, పరిశ్రమలు దేశ ప్రగతికి మూలస్తంభాలు. ఆ రెండింటి వికాసానికి చేయూతను ఇచ్చే వ్యవస్థలవల్ల సమాజానికి ప్రేయస్సు, శ్రేయస్సు కలుగుతాయి. ఆయా రంగాలలో పరిశ్రమించే వ్యక్తులకు ఉత్థాన పతనాలు సహజం. వాటిని సమన్వయం చేసుకుంటూ తాము ఎదుగుతూ సమాజ వికాసానికి, విస్తరణకూ స్ఫూర్తిని ఇచ్చే పారిశ్రామిక వేత్తలు ఆదరణీయులు.

ప్రతి వ్యక్తికీ కొన్ని పూర్వ నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి. వాటిని ఆదరిస్తూ కార్యసాధకుడు లక్ష్యసాధనకు ఉపక్రమిస్తాడు. “ఏ నక్షత్రం మంచిది? ఏది కాదు?” అని అతిగా విచారిస్తూ కూర్చుంటే చేయవలసిన పని కాస్తా జారిపోతుంది. “ఏ పని చేయాలన్నా కావలసింది ధనమే కాని నక్షత్రాలు ఏం చేస్తాయి” అంటారు ఆచార్య చాణక్య. ఆరు పాళ్ళ మానవ ప్రయత్నం, ఒక పాలు దైవ సాయం.. కలిస్తే ‘కార్యసాధన’.

దైవ సహాయాన్నే మనం అదృష్టం అంటాం. పూర్వజన్మ సుకృతం అదృష్ట రూపంలో ఉత్తమ ఫలితాలను ఇస్తుందనేది విశ్వాసం. ఆత్మవిశ్వాసం లోపించిన వారు ఊహాసౌధాలలో విహరిస్తూ, తమ అపజయాలకు దురదృష్టమే కారణమని, కాలం కలసి రాలేదని సాకులు వెతుక్కుం టూ కూర్చుంటారు.

వనరుల సమీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం కలిగిన ధీశాలి నక్షత్రాల అనుకూలత, ప్రతికూలతలపై ఆధారపడి కాలాన్ని వృథా చేయడు. బాహ్య పరిస్థితులపై అమితంగా ఆధారపడే వ్యక్తి ఆర్థిక స్థితిగతులు స్థిరంగా అభ్యుదయ పథంలో పయనించవు. బా ధ్యత తెలియని లేదా తమ నిర్ణయాలపై బాధ్యత తీసుకోలేని పరాన్నభుక్కులు మాత్రమే అపజయానికి కారణాలను వెతుక్కుంటారు.

జాతకాల పిచ్చి వద్దు!

“సహజమైన గ్రహతారకల గతులను అదృష్టానికి అనుసంధానించుకొని, సరైన పనిని సరైన సమయంలో, సరైన విధానంలో చేయకుండా, తమ అపజయాలను గ్రహస్థితులకు అంటగట్టడం మూర్ఖత్వం” అంటాడు చాణక్య. కొందరు అత్యుత్సాహంతో పరిశ్రమను స్థాపిస్తారు. అనుభవ రాహిత్యం, వనరుల కొరత, పరిశ్రమ లోతుపాతులు అవగాహన లేకపోవడం వంటి కారణాలతో అనుకున్న స్థాయి విజ యం సాధించలేరు.

దీనిని ఆసరా చేసుకొని బంధుమిత్రులు, పోటీదారులు పలు రకాలుగా మానసికంగా క్రుంగదీస్తారు. అపజయం పాలైన పారిశ్రామిక వేత్తగా ముద్ర వేసి ఆ వ్యక్తిలోని సాధించాలనే తపనను, సృజనాత్మకతను నిర్వీర్యం చేస్తారు. సాధించగలననే అతని నమ్మకాన్ని ఈ రకంగా దెబ్బతీస్తారు.

నమ్మకం అనేది సాధారణంగా వ్యక్తి దృష్టికోణానికి, అనుభవానికి, వివరణాత్మకమైన విశ్లేషణాశక్తికి సంబంధించి మనసు లో రూపు దిద్దుకునేది. ఇది సాధారణీకరించలేని వ్యక్తిగత భావన మాత్రమే. నమ్మకాలను అనుసరించి వ్యక్తి ప్రవర్తన, ప్రవర్తన ను అనుసరించి అతని వ్యాపార నిర్వహణలు సాకారమవుతాయి. తన ప్రవర్తన ద్వారా నమ్మకాన్ని కలిగించిన పారిశ్రామిక వేత్త, కొనుగోలుదారుని నిర్ణయాన్ని ప్రభావితం చేయగలుగుతాడు.

వాటాదారుల ను, పెట్టుబడిదారులను, సహకరించే వారిని, ప్రావీణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించ గలుగుతాడు. తమ అభిప్రాయాలను మార్చుకోవడం, ఇతరుల అభిప్రా యాలను మార్చడం అసాధ్యం కాదు కాని కొంత కష్టసాధ్యం.

వ్యాపార సంస్థల ప్రగతిని దాని లాభార్జనా స్థాయినిబట్టి నిర్ణయిస్తారు. అయితే, ఉత్తమ వ్యాపార సంస్కృతిని కలిగిన సంస్థ లు సహచరుల భావోద్వేగ సంతులతను పెంచుతూ, వారి వ్యక్తిగత, కార్యాలయ జీవితాలలో ఆనందాన్ని సాధించే దిశలో నడిపిస్తాయి. దానికి ప్రాతిపదికగా సంస్థపట్ల విశ్వాసాన్ని పెంచుతాయి. విజయాన్ని సాధించగలననే నమ్మకం ఉత్తమ పారిశ్రామిక వేత్తలను తయారుచేస్తుంది. అపజ యం పలకరిస్తుందనే భయం అభ్యుదయ మార్గానికి ప్రథమ శత్రువు. మేధ విస్తరిస్తే భయం అంతరిస్తుంది. బుద్ధి వికాసం మార్పువల్ల సాధ్యపడుతుంది.

కాని మా ర్పును ఆహ్వానించేందుకు మనలో తిష్ట వేసుకున్న మూఢ నమ్మకాలు అనుమతించవు. అందుకే ఉన్నత సాంకేతిక విద్యలను ఆర్జించినా, నైపుణ్యాలను అమితంగా కలిగియున్నా చాలామంది ఉద్యోగాల వేటలో జీవితాలను గడిపేస్తారే కాని పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఉత్పత్తిని పెంచి సంపదను సృష్టించేందుకు సాహసించరు. దానికి కా రణం సాధించలేమనే అపనమ్మకం. దీనికి తోడుగా సౌకర్యవంతమైన వలయంలో నుంచి బయటకు రాలేని మానసిక స్థితి.

హేతుబద్ధత, స్వయంకృషి..

తిథి వార నక్షత్రాలు, అదృష్టం విజయాన్ని ఇస్తాయో లేదో కాని నిరంతర ప్ర యత్నం, సరైన మార్గంలో ప్రయాణం మాత్రం విజయాన్ని అనుగ్రహిస్తాయని ఎందరో పారిశ్రామిక వేత్తలు నిరూపించా రు. శత్రువు దండెత్తి వచ్చిన సమయంలో ఈరోజు బాగా లేదని, ఇది దుర్ముహూర్తమని, రాహుకాలమని కూర్చుంటే పరాజ యమే కాదు, ప్రాణాంతకమూ కావచ్చు.

అయితే, అనుకోని కారణాలవల్ల ఒక్కొక్కప్పుడు వరుసగా అపజయాలు పలకరిం చవచ్చు లేదా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అది దురదృష్టానికి సంకేతమని భావించకుండా అపజయానికి కారణాలను విశ్లేషించుకొని నూతన మార్గాలలో, కొత్త సాంకేతికతలతో, మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడు వారి ప్రయత్నం తప్పక ఫలప్రదమవుతుంది.

స్వల్ప కాలంలోనే అమిత లాభార్జన చేయాలనే అత్యాశ, ఇతరుల ఎదుగుదలపై అసూయాద్వేషాలు, సాహసోపేత నిర్ణయా లు తీసుకోవడంలో పిరికితనం, నేను ఓడి నా ఇతరులను గెలిపించాలనే అసహజ జాలి, ఎదుటివారు మోసగిస్తారనే భయం, ఎవరేమనుకుంటారో అనే మొహమాటం, మితిమీరిన అహంకారం, నమ్మిన వారిని మోసం చేయాలనే దురాలోచన, దీనత్వం, లభించిన దానిపై చిన్నచూపు, గ్రహగతులపై అధికంగా ఆధార పడడం వంటి కార ణాలవల్ల పారిశ్రామిక వేత్తలు కాలాంతరంలో నష్టాల ఊబిలో దిగిపోతారు.

ఫలి తంగా సంస్థలు ఉనికిని కోల్పోతాయి. ఎందరికో ఉపాధి పోతుంది. అదృష్టంపై ఆధార పడడం కన్నా బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యంతో ముందడుగు వేయాలి. ఈ రకమైన పరిణత వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. దార్శనికత అవకాశాలను, సహానుభూతి ఇతరుల ప్రజ్ఞా పాటవాలను గుర్తిస్తాయి. సహనం ఇతరులతో కలిసి పని చేసే విధానాన్ని నేర్పుతుంది. సాహసం అసాధ్యాల ను సుసాధ్యం చేస్తుంది. సహృదయత కలిగిన దాన్ని ఇతరులతో పంచుకోమం టుంది. హేతుబద్ధ విజ్ఞానం, స్వయంకృషిపై ఆధార పడాలని చాణక్యుడు ఈతరం ఔత్సాహికులకు బోధిస్తున్నాడు.